రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లక్ష్యంగా శ్రమించాలి

కలిసికట్టుగా ఎంఐఎం పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలి

పెద్దపల్లి, రామగుండం నేతలకు సభ్యత్వ నమోదు బుక్కులను పంపిణీ చేసిన పార్టీ ఎన్నికల పరిశీలకుడు గులాం అహ్మద్ హుస్సేన్

పెద్దపల్లి, సెప్టెంబర్ 01 (జనంసాక్షి)

రాబోయే 2025 మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా ప్రతి కార్యకర్త శ్రమించాలని ఎంఐఎం పార్టీని పెద్దపల్లి పట్టణంలో రాబోయే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా బలోపేతం చేయాలని ఎంఐఎం పార్టీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్, పార్టీ ఎన్నికల పరిశీలకుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ పిలుపునిచ్చారు. ఎంఐఎం అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు శుక్రవారం నమాజ్ అనంతరం పట్టణంలోని డీసెంట్ ఫంక్షన్ హాల్ లో రామగుండం, పెద్దపల్లి మున్సిపల్ కు చెందిన ఎంఐఎం పార్టీ క్రియాశీలక నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన పార్టీ ఎన్నికల సభ్యత్వ నమోదు ప్రక్రియను గులాం అహ్మద్ హుస్సేన్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఐఎం పార్టీని అందరూ కలిసికట్టుగా, పదునైన మెట్టుగా పెద్దపల్లి, రామగుండం లలో బలోపేతం చేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయా వార్డుల్లో ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని, నిత్యం ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కారం దిశగా కంకణ బద్ధులై కృషి చేయాలని సూచించారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీని పెద్దపల్లి పట్టణంతో పాటు రామగుండం, మంథని అసెంబ్లీ నియోజకవర్గాలలో నిర్ణయాత్మక శక్తిగా ఎంఐఎం పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఈ మూడు మున్సిపల్ పరిధిలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు దళిత, ముస్లిం, బడుగు బలహీన వర్గాల మద్దతుతో అత్యధికంగా కౌన్సిలర్ స్థానాలు గెలుచుకునేలా శ్రమించాలన్నారు. పార్టీతోనే కార్యకర్తలకు భవిష్యత్తు ఉంటుందని, పార్టీ కంటే సుప్రీం ఎవరు కాదని అన్నారు. ఎవరైనా పార్టీ కంటే వ్యక్తిగతంగా తాము గొప్పవాళ్ళం అని విర్ర వీగితే చరిత్రలో గెలవలేదని, నిలవలేదన్నారు. 8, 9, 25, 26, 30, 34, 35, 36, 3, 14 పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిల్ లో, 1, 20, 21, 22 రామగుండం డివిజన్లలో పార్టీ సభ్యత్వ నమోదు కోసం షోబే తంజీమ్, సభ్యత్వ నమోదు ప్రక్రియ ఇంచార్జ్ హఖ్ నజీర్ సూచనల మేరకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం నేత నసీర్, పెద్దపల్లి నేతలు ఎంఐఎం పార్టీ నాయకులు ఇమ్రాన్ అడ్వకేట్, ముఖీమ్, ఇమ్రాన్ అలీ, శోభి బేగ్, ముజాహిద్, మోహిద్, అజ్మత్, కలీం, సయ్యద్, సోహైల్, హఫీజ్ మొయిజుద్దీన్, సల్మాన్, జియావుద్దీన్, మిస్బా, ఫజీల్ తదితరులు పాల్గొన్నారు.