రామగుండం.. అగ్నిగుండం

1

47 సెంటిగ్రేడ్‌ డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత

తెలంగాణలో కొనసాగుతున్న వడగాడ్పులు

హైదరాబాద్‌,మే30(జనంసాక్షి): రామగుండంలో భానుడు ప్రచండ రూపం దాల్చాడు. ఇక్కడ 47 సెంటిగ్రేడ్‌ డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. భానుడి ప్రతాపంతో తెలంగాణ అట్టుడుకుతోంది. గత రెండు వారాలుగా రాష్ట్రం నిప్పులకొలిమిని తలపిస్తుడటంతో ప్రజలు అల్లాడుతున్నారు. వడదెబ్బకు గురై మృత్యువాతపడుతున్నారు.. శనివారం కరీంనగర్‌ జిల్లా రామగుండంలో 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, హన్మకొండలో 45, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మెదక్‌లో 44 డిగ్రీలు, హైదరాబాద్‌లో 43, హకీంపేటలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో వేడిగాలుల ప్రభావం ఇంకా కొనసాగుతోంది.  తెలంగాణ రాష్ట్రంలో శనివారం  వడదెబ్బతో 38 మంది మృతి చెందారు. కరీంనగర్‌ జిల్లాలో 11మంది, వరంగల్‌ జిల్లాలో 8, నల్లగొండ జిల్లాలో ఆరు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఐదుగురు, ఆదిలాబాద్‌ జిల్లాలో నలుగురు, మెదక్‌ జిల్లాలో ఇద్దరు, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు.

ఇప్పటికే ఎండ వేడిమికి రాష్ట్రవ్యాప్తంగా 500 మంధికి పైగా మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడించారు.  రోహిణి కార్తె కారణంగా  ఎండలు మండిపోతోన్నాయి.  మరోవైపు జూన్‌ ఒకటో తేదీన కేరళ తీరాన్ని తాకుతాయనుకున్న నైరుతి ఋతుపవనాలు మరికొంత ఆలస్యంగా రానున్నాయి. ఈ మేరకు కేరళ వాతావరణశాఖ అధికారులు ప్రకటన వెలువడించారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ సారి తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు చెప్తున్నారు.