రామమందిర నిర్మాణానికి..  కాంగ్రెస్‌ మద్దతు

– ఇక బీజేపీ తలుపులు మూసుపోతాయి
– కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా
న్యూఢిల్లీ, నవంబర్‌9(జనం సాక్షి) : అయోధ్య కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును గౌరవిస్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా అన్నారు. సుప్రీం తీర్పు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.. రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణానికి తాము అనుకూలమని పేర్కొన్నారు. లౌకిక విలువలు, రాజ్యాంగం అందించిన భిన్నత్వ స్ఫూర్తికి కట్టుబడి ఉండాలని, శాంతి, సౌభ్రాతృత్వం వర్ధిల్లాలని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షత జరిగిన వర్కింగ్‌ కమిటీ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ తీర్మానం ఆమోదించినట్లు తెలిపారు. తరతరాలుగా సమాజంలో పరస్పరం గౌరవించుకొనే మన సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత అందరి విూదా ఉందని సుర్జేవాలా అన్నారు. రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్‌ పార్టీ మద్దతిస్తుందా అని ప్రశ్నించగా ఆయన స్పష్టమైన సమాధానం ఇచ్చారు. మందిరం నిర్మాణానికి కాంగ్రెస్‌ పార్టీ అనుకూలమేనని వెల్లడించారు. సుప్రీం తీర్పు ఏ వ్యక్తులు, సంఘాలు, మతాలు, రాజకీయ పార్టీలకు ఘనత, అవమానం కాబోదని ఆయన పేర్కొన్నారు.