రాయలసీమ ఎత్తిపోతల పథకం సరికాదు
– తప్పుపట్టిన కేంద్రం
– జలసంఘం మార్గదర్శకాలు పాటించండి
దిల్లీ,డిసెంబరు 17 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్ విషయంలో కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌లో రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక అంశాలు లేవని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌కి కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ సంచాలకులు లేఖ రాశారు. హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర అనుమతులు, ఇరిగేషన్ ప్లానింగ్, డిజైనింగ్, కాస్ట్ ఎస్టిమేట్ తదితర ప్రాథమిక అంశాలను డీపీఆర్‌లో వెల్లడించలేదని లేఖలో పేర్కొంది. డీపీఆర్ సమర్పించే విధానంలోనూ సీడబ్ల్యూసీ మార్గదర్శకాలు పాటించలేదంది. ఎలాంటి ప్రాథమిక అంశాలు లేని డీపీఆర్‌ను పరశీలించడం సాధ్యం కాదని.. నిర్ణీత మార్గదర్శకాల మేరకు పూర్తి అంశాలను పొందుపర్చి డీపీఆర్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి జల్‌శక్తి మంత్రిత్వ శాఖ సూచించింది.