రాలిన తెలంగాణ సాహితీ వనపుష్పం
మహా దిగ్గజం దాశరథి కన్నుమూత
సీఎం కేసీఆర్ సంతాపం
నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
హైదరాబాద్,జూన్8(జనంసాక్షి): తెలుగు సాహిత్యంలో మరో ధృవతార నేలరాలింది. సాహితీ పరిమళాలను తన ప్రజలకు అందించిన ఓ మహా దిగ్గజం ఈ నేలను విడిచి నింగికేగింది. ఓ నిజాం పిశాచమా అంటూ నినిదించి తన అక్షర తూణీరాలతో బాణాలనెఎక్కుపెట్టిన దాశరథి ఇకలేరు. ప్రముఖ రచయిత , సాహితీ దిగ్గజం, స్వాతంత్య్ర సమరోదుడు దాశరథి రంగాచార్య సోమవారం ఉదయం కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దాశరథి తుదిశ్వాస విడిచారు. అభ్యుదయ రచయితగా, తెలంగాణ సాయుధ పోరాట యోధుడిగా దాశరథి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. దాశరథి స్వస్థలం వరంగల్ జిల్లా చినగూడూరు. నవలాకారుడిగా ప్రసిద్ధికెక్కిన దాశరథి రంగాచార్య స్వయంగా ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అని పలికిన దాశరథి కృష్ణమాచార్యకు సోదరుడు. తెలంగాణ విమోచనోద్యమ సమరయోధుడు దాశరథి ఆగస్టు 24, 1928న జన్మించారు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వాన్ని ఎదురించి జైలుకు వెళ్లారు. హైదరాబాద్ సంస్థానం విలీనం తర్వాత ఉపాధ్యాయుడిగా, అనువాదకుడిగా పని చేసి, సికింద్రాబాద్ కార్పోరేషన్ డిప్యూటీ కమిషనర్‌గా 1988లో పదవీ విరమణ పొందారు. చిల్లర దేవుళ్లు, మోదుగుపూలు, జానపదం నవలలను దాశరథి రచించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడవిూ అవార్డుతో పాటు పలు పురస్కారాలు పొందిన రంగాచార్య చిల్లర దేవుళ్లు నవల ద్వారా ప్రసిద్ధి చెందారు. ఈ నవల సినిమాగా కూడా తెరకెక్కింది. ఈ నవలలో ఆయన తెలంగాణ మాండలీకాన్ని ఎక్కువగా ఉపయోగించారు. తన ఆత్మకథను జీవనయానం పేరుతో రచించారు. అయితే తెలంగాణ విమోచనోద్యమానికి ముందుకు నిజాం ఆగడాలను స్వయంగా చూసిన రంగాచార్య వీటిని గ్రంథస్తం చేయడానికి పూనుకున్న రచనే ‘చిల్లర దేవుళ్లు’. నిజాం కాలంలో అప్పటి ప్రజల దుర్భర స్థితిగతులను, దారుణమైన బానిస బతుకులను రంగాచార్య ఇందులో క్షుణ్ణంగా వివరించారు. సంస్థానం విలీనం తర్వాత ప్రజలు నిజాం దురాగతాలను మరిచిపోయి నిజాంను కీర్తిస్తారనే అనుమానంతో ఈ గ్రంథ రచన చేసినట్లుగా రంగాచార్య చెప్పుకున్నారు. అయితే 1970 ఈ గ్రంథానికి ఏపీ సాహిత్య అకాడవిూ అవార్డు లభించింది. హిందీ, ఆంగ్ల ,పలు ప్రాంతీయ భాషలలో ఈ గ్రంథం అనువదింపబడింది. ఇదే పేరుతో తెలంగాణ యాసలో సినిమా కూడా విడుదలైంది. మోదుగు పూలు, జనపథం, రానున్నదీ ఏది నిజం, మానవత్వం, పావని తదితర గ్రంథాలే కాకుండా జీవనయానం పేరుతో తన ఆత్మకథను రాసుకున్నారు. దాశరథి రంగాచార్య మృతి పట్ల ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గొప్ప వ్యక్తి రంగాచార్య అని కొనియాడారు. తన రచనల ద్వారా దాశరథి సామాజిక స్ఫూర్తిని ప్రదర్శించారని చెప్పారు. తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి దాశరథి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దాశరథి రంగాచార్య(89) మృతిపట్ల మంత్రి పద్మారావు, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలచారి, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి,కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, వెంకయ్యనాయుడు, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మురళీధర్‌రావు, ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ సంతాపం తెలిపారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ..దాశరథి మృతి సాహితి లోకానికి, తెలంగాణ ప్రజలకు తీరని లోటన్నారు. ప్రముఖ సాహితీవేత్త దాశరథి రంగాచార్య చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. దాశరథి భౌతికకాయాన్ని వెస్ట్‌మారేడుపల్లిలోని స్వగృహానికి తరలించారు. ఈ సందర్భంగా దాశరథి కుమారుడు విరించి మాట్లాడుతూ.. వారం రోజుల క్రితం దాశరథి అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. దాశరథికి బీపీ, షుగర్ లెవల్స్ పెరిగిపోయాయని చెప్పారు. ఏడో ఏట నుంచే దాశరథి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. వేదాలను సరళంగా దాశరథి తెలుగులోకి అనువదించారని పేర్కొన్నారు. మారేడుపల్లి శ్మశానవాటికలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు దాశరథి అంత్యక్రియలు ఉంటాయని తెలిపారు. ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దాశరథి రంగాచార్య(89) అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వెస్ట్ మారేడుపల్లిలో రంగాచార్య భౌతికకాయానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు వెళ్లి నివాళులర్పించారు. మంగళవారంమధ్యాహ్నం వెస్ట్ మారేడుపల్లిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.దాశరథి గొప్ప కవి అని కడియం అన్నారు. ఆయన మృతి తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటన్నారు. ఆయన మృతికి ప్రభుత్వ పరంగా సంతాపం ప్రకటించారు. ప్రముఖ సాహితీవేత్త దాశరథి రంగాచార్య మృతిపట్ల ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర సంతాపం ప్రకటించారు. సాహితీ పక్రియల్లో దాశరథి చేసిన కృషి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిందని కొనియాడారు.