రావత్ మృతి పట్ల సంతాపం తెలిపిన అమెరికా
ఇరుదేశాల సైనిక బంధానికి కృషి చేశారని కితాబు
వాషింగ్టన్,డిసెంబర్9(జనంసాక్షి ): చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి మృతికి అమెరికా రక్షణశాఖ నివాళి అర్పించింది. రావత్ కుటుంబసభ్యులతో పాటు ఆ ప్రమాదంలో చనిపోయిన బాధితులందరికీ అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ సంతాపం తెలిపారు. భారత్, అమెరికా రక్షణ సంబంధాల మధ్య రావత్ కీలక పాత్ర పోషించినట్లు ఆస్టిన్ తెలిపారు. రావత్ మృతి పట్ల అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మార్క్ మిల్లే కూడా నివాళి అర్పించారు. భారతీయ సైన్యంపై రావత్ ప్రభావం ఎక్కుగా ఉంటుందన్నారు. రెండు దేశాల మధ్య సైనిక బంధాల బలోపేతం కోసం రావత్ కృషి చేసినట్లు జనరల్ మార్క్ మిల్లే తెలిపారు. అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ కూడా ఓ ప్రకటన రిలీజ్ చేసింది. రావత్ విషాదకర మృతి పట్ల నివాళి అర్పిస్తున్నట్లు పెంటగార్ కార్యదర్శి జాన్ కిర్బీ తెలిపారు.ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో రావత్ మృతి చెందిన విషయం తెలిసిందే.