రాష్ట్రంలోని ప్రతిగడపకు మంచినీరు
మేడ్చల్ మల్కాజ్ గిరి: రాష్ట్రంలో మిషన్ భగీరథ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. రూ. 628 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 183 గ్రామాలు, 7 మున్సిపాలిటీలకు మంచి నీటి వసతి ని మిషన్ భగీరథ ద్వారా కల్పించనున్నారు. 412 రిజర్వాయర్లు, 2041 కిలోమీటర్ల మేర పైప్ లైన్ల పనుల కోసం ఇవాళ జిల్లాలోని కొంపల్లి దగ్గర మిషన్ భగీరథ పైప్ లైన్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు మల్లారెడ్డి, బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యేలు తీగల కృష్ణా రెడ్డి, సుధీర్ రెడ్డి, వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హాజరయ్యారు. ప్రాజెక్టు సావనీర్ ను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి… ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంటింటికి నల్లా నీరు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలన్నీ తీర్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నారన్నారు.
వచ్చే ఏడాదిలోపు ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలన్నింటికీ అంటే దాదాపు 10 లక్షల మందికి మంచినీరు అందుతుందని స్పష్టం చేశారు. రూ. 628 కోట్లతో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టామని ఆయన తెలియజేశారు. గ్రామాల్లోనూ ప్రతి మనిషికి ప్రతి రోజు 135 లీటర్ల సురక్షిత మంచినీరు అందిస్తమని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి గడపకు మంచి నీరు అందిస్తమన్నారు. దీని ద్వారా 183 గ్రామాల్లోని 10 లక్షల మందికి మేలు కలుగుతుందన్నారు. ఏడాదిలోగా ఈ పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. ఇండ్లు, వ్యవసాయం, పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దని ఆయన వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం దూసుకుపోతున్నదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక ప్రతిపక్షాలకు పనిలేకుండా పోయిందన్నారు. గత ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పట్టించుకోలేదన్నారు.
హైదరాబాద్ లో 30 లక్షల విలువ చేసే ఇంటిని ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇస్తున్నదన్నారు. సంవత్సరంలోగా హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టి చూపిస్తమని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఒక ఇంటికి అవుతున్న ఖర్చు రూ. 8 లక్షల 65 వేలని తెలియజేశారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోసం రూ. 18 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలన్నదే సీఎం కేసీఆర్ కల అని మంత్రి చెప్పారు. గొర్రెల పెంపకం పథకం కోసం రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. మెట్రో వాటర్ వర్క్స్ పనితీరుకు ఐఎస్ వో సర్టిఫికెటే నిదర్శనమని ఆయన కొనియాడారు. పేదల ఇండ్లకు మనం ఖర్చు చేస్తున్న డబ్బును దేశం మొత్తం మీద కూడా ఖర్చు పెట్టడం లేదన్నారు. స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తున్న జలమండలికి ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం గండి మైసమ్మలో డబుల్ బెడ్ రూం ఇండ్లకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.