రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ సేవలు విస్తరింప చేయాలి:కేంద్ర మంత్రి బి ఎల్ వర్మ
దంతాలపల్లి సెప్టెంబర్ 4 జనంసాక్షి
ఆయుష్మాన్ భారత్ సేవలను తెలంగాణా రాష్ట్రంలో మరింత విస్తరింప చేయాలని ఈశాన్య ప్రాంత అభివృద్ధి,కేంద్ర సహకార శాఖా మంత్రివర్యులు బి.ఎల్ వర్మ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం మంత్రి సందర్శించి వైద్య సేవలు,కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ పథకాలపై స్పష్టత కలిగి ఉండాలని,కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆయూష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.ఈ సేవలను పేద ప్రజలు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ సమయంలో ఇబ్బందికర పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొని అదుపులోకి తెచ్చిందన్నారు. ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ అందించామని,రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్ డోస్ ఇస్తున్నామని, మొదటి,రెండవ డోస్ మాదిరిగానే బూస్టర్ డోస్ కూడా త్వరగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రి బి ఎల్ వర్మ వైద్యాధికారులకు సూచించారు. దంతాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 100 శాతం మొదటి,రెండవ డోసులు వ్యాక్సినేషన్ పూర్తి చేయడం అభినందనీయమన్నారు. రోగులు వైద్యులను దేవునితో సమానంగా చూస్తూ ప్రాణదాతలు గా భావిస్తారని, వారికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యాధికారులు సేవాభావంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ,ఆయుష్ మాన్ భారత్ సేవల రికార్డులను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ హరీష్ రాజ్, తోర్రూరు రెవెన్యూ డివిజనల్ అధికారి రమేష్, మండల వైద్యాధికారి డాక్టర్ వేద కిరణ్, తహసీల్దార్ కిషోర్ కుమార్ అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.