రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు
– కాలుష్య నియంత్రణకు పకడ్బందీ చర్యలు
– ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా తెలంగాణ
– వెయ్యి ఎకరాల్లో ఆటో మొబైల్ తయారీ యూనిట్
– వాహనాల ఉత్పత్తికి భారీ ప్రోత్సాహకాలు
– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
– ఎలక్ట్రిక్ వాహనాల నూతన విధానం విడుదల
హైదరాబాద్,అక్టోబరు 30(జనంసాక్షి): తెలంగాణను ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా మార్చబోతున్నామని, ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణ ఫ్రెండ్లీ వెహికల్స్ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే టీఎస్ ఐపాస్, బీఎస్ ఐపాస్ విజయవంతం అయ్యాయి. ఎలక్ట్రిక్ వాహనాలు కూడా విజయవంతం కాబోతున్నాయి. గత ఐదేళ్లలో తెలంగాణకు 2.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ) పాలసీని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కలిసి శుక్రవారం ఉదయం విడుదల చేశారు. జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో తెలంగాణ ఈవీ సమ్మిట్‌లో పాలసీ విధానాన్ని ప్రకటించారు. 2020-2030 వరకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగంపై విధానమైన ప్రకటన చేశారు. ఐదు కంపెనీలతో ఇవాళ ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ ప్రజలతో పాటు రైతులు ఇబ్బందులు పడ్డారు. పర్యావరణాన్ని రక్షించాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యతను కరోనా మరోసారి గుర్తు చేసిందన్నారు. కాలుష్యం లేని వాతావరణాన్ని భవిష్యత్ తరాలకు మనం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. డీ కార్బనైజేషన్, డిజిటలైజేషన్, డీ సెంట్రలైజేషన్ అమలు చేయాలని సూచించారు. మరి కొన్నేళ్లలోనే రాష్ట్రంలోని జనాభా గ్రామాల కంటే పట్టణాల్లోనే ఎక్కువగా ఉంటుందన్నారు. రాష్ట్ర జీఎస్‌డీపీలో 50 శాతం హైదరాబాద్ నుంచే వస్తుందని పేర్కొన్నారు.
వెయ్యి ఎకరాల్లో ఆటో మొబైల్ తయారీ యూనిట్
మన వద్ద పెద్ద ఎత్తున సౌర విద్యుత్ అందుబాటులో ఉందన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామని స్పష్టం చేశారు. ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ తయారీ కంపెనీలు పెట్టుబడి పెట్టనున్నాయి. ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అందుబాటులో భూములు ఉన్నాయని తెలిపారు. మహేశ్వరంలో వేల ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. వెయ్యి ఎకరాల్లో ఆటో మొబైల్ తయారీ యూనిట్‌ను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ వాహనాల తయారీ, నిర్వహణకు కంపెనీలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. గతంలో ఈసీఐఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశానికే హైదరాబాద్ కేంద్రంగా ఉండేది. ఎలక్ట్రిక్ వాహనాల నూతన విధానం అద్భుతంగా విజయవంతం కాబోతుందన్నారు. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్లు నెలకొల్పుతామని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో కంపెనీలు పెట్టుబడులు పెట్టబోతున్నాయని తెలిపారు. ఇప్పటికే 78 ఛార్జింగ్ స్టేషన్లు ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉన్నాయన్నారు. ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. ఐటీ రంగంలో జాతీయ స్థాయి కంటే ఎక్కువ అభివృద్ధి రేటు ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, సినీ నటుడు విజయ్ దేవరకొండ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా పాల్గొన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల నూతన విధానం విడుదల
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ) పాలసీని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కలిసి శుక్రవారం ఉదయం విడుదల చేశారు. జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో తెలంగాణ ఈవీ సమ్మిట్‌లో పాలసీ విధానాన్ని ప్రకటించారు. రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ఈ నూతన విధానాన్ని ప్రకటించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంధన నిల్వలకు కొత్త విధానం అమలు చేయనున్నారు. 2020-2030 వరకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగంపై విధానమైన ప్రకటన చేశారు. పాలసీ విడుదల కార్యక్రమంలో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్, మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్‌కుమార్ గోయెంకా, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, ఎస్ బ్యాంకు చైర్మన్ సునీల్ మెహతా తదితరులు పాల్గొన్నారు. తయారీదారులు, వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలు కల్పించింది. వాహనాల ఉత్పత్తికి భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. రాష్ట్రంలోనే కొనుగోలు చేసి,రిజిస్ట్రేషన్ చేయించుకుంటే పలు రాయితీలకు అవకాశం కల్పించింది. ఈ విధానం అమలుకు ఉన్నతాధికారులతో నిర్వాహక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఆయా పరిశ్రమలు, మెగా ప్రాజెక్టులు రూ. 200 కోట్లకు మించి పెట్టుబడులు పెట్టడం జరిగింది. పెట్టుబడి మొత్తంలో మెగా ప్రాజెక్టులకు 25 శాతం రాయితీ కల్పించనున్నారు. విద్యుత్ ఛార్జీలు, స్టాంపు, రిజిస్ట్రేషన్ ఫీజులపై రాయితీలు ఇవ్వనున్నారు. మొదటి 2 లక్షల ద్విచక్ర వాహనాలకు రహదారి పన్ను మినహాయింపు ఇవ్వనున్నారు. 5 వేల ఫోర్ వీలర్లు, 10 వేల లైట్ గూడ్స్, క్యారియర్‌లకు పూర్తిగా పన్ను రద్దు చేయనున్నారు. ప్రజా రవాణాలోనూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి కసరత్తులు చేస్తున్నారు. పార్కింగ్, ఛార్జింగ్ సమస్యలకు పరిష్కార మార్గాలు వెతకనున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు చేసి ప్రత్యేక రుసుములు వసూలు చేయనున్నారు. జాతీయ రహదారులపై ప్రతి 50 కిలోవిూటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ కొంత కాలం క్రితం క్యాబినెట్ ఆమోందించిన విషయం తెలిసిందే. వాహన కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నది. ఇందుకోసం రాష్ట్రంలోనే తయారీ యూనిట్లు, చార్జింగ్ పాయింట్లను పెట్టేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ప్రజలు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేలా రాయితీలను ప్రకటించింది.