రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా?: సీపీఐ ఎంఎల్ న్యూ డెమొక్రసీ
ఖమ్మం, ఆగస్టు 3 : రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే ప్రభుత్వాలు తమకు కుర్చీలను కాపాడుకోవడంలో చూపుతున్న శ్రద్ధ ప్రజాసమస్యలపై చూపడంలేదని సీపీఐ ఎంఎల్ న్యూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి రంగారావు విమర్శించారు. ఒక పక్క రైతులు వర్షాభావంతో విలవిల్లాడుతుంటే మరోవైపు విద్యుత్ సమస్య వేధిస్తుందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ తయారీలేని పక్షంలో పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి ఇవ్వాలన్నారు. సర్ చార్జీల పేరుతో ప్రభుత్వం 5వేల కోట్ల రూపాయల అదనపు విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపుతోందన్నారు. జిల్లాలో వర్షాభావం వల్ల చెరువులు, కుంటలు, ఎండిపోయి కనిపిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం రైతులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. మీ సేవ కేంద్రాలలో ప్రజలకు మేలు జరగడంలేదని రంగారావు అన్నారు.