రాష్ట్రంలో బలం చాటుకునే ఎత్తులో లెఫ్ట్‌ పార్టీలు

జనసేన,బిఎస్పీ పొత్తుతో బలమైన కూటమిగా ఏర్పాటు
మళ్లీ సత్తా చాటేందుకు ఉత్సాహంగా ప్రచారం
విజయవాడ,మార్చి26(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. 175 శాసన సభ, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీలు ఖరారయ్యాయి. రంగంలో చాలా పార్టీలు, చాలా మంది అభ్యర్ధులు ఉండవచ్చుగాక కానీ ప్రధానంగా పోటీ మూడు శక్తుల మధ్య ఉంటుందని తేలిపోయింది. తెలుగు దేశం పార్టీకీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మధ్య పోటీ ఉంటుందని కొందరు భావించినా, ఈ ఎన్నికల్లో వామపక్షాలు అనుసరించిన ఎన్నికల ఎత్తుగడల మూలంగా పోటీ త్రిముఖమయింది. జనసేన, సిపిఐ(ఎం), సిపిఐ, బిఎస్‌పిల మధ్య ఎన్నికల పొత్తు కుదిరిన తరువాత ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది.ఈ ఎన్నికల్లో జనసేనతో పొత్తు కుదురన్చుకున్న వామపక్ష పార్టీలు మరోమారు ఎపిలో తమ బలం చాటుకుని ఉనికిని నిలబెట్టుకోవాలని చూస్తున్నాయి. గత ఎన్నికల్లో లెఫ్ట్‌ పార్టీలకు ఎపి అసెంబ్లీలో ఒక్కసీటు కూడా లేదు. దీంతో ఎలాగైనా గెలిచి నిలవాలని చూస్తున్నాయి.  ఎన్నికల ప్రణాళికను ప్రజల్లోకి బలంగా తీసుకుని పోవలసిన అవసరం ఉందని భావించి ఆ మేరకు నేతలు కసరత్తు చేస్తున్నారు.అభివృద్ధి రాష్ట్ర ప్రజలందరికీ చేరాలంటే అన్ని ప్రాంతాలూ, అన్ని సెక్షన్ల ప్రజలు అభివృద్ధి చెందాలి. చంద్రబాబు నాయుడు గతంలో అభివృద్ధి అంతా హైదరాబాదు విూద కేంద్రీకరించడంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు వెనకబడిపోయాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం, వంటి జిల్లాలే కాకుండా, ఆయా జిల్లా కొన్ని ప్రాంతాలు కూడా వెనుకబడి ఉన్నాయి. అందుకే వామపక్షాలు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రణాళిక వేసి దాని కోసం కృషి చేస్తాయి. నేటి పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక ¬దా, విభజన హావిూల అమలు తప్పని సరి. వాటి సాధన కోసం వామపక్షాలు నిరంతరం కృషి చేస్తాయని బలంగా ప్రచారం చేస్తున్నాయి.   తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపిల విధానాలతో విసిగిపోయిన ప్రజలకు ఒక ప్రత్యామ్నాయం లభించింది. వామపక్షాలు, జనసేన, బిఎస్‌పిల కూటమి ఎన్నికల్లో ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ముందుకు రావడంతో అధికార, ప్రధాన ప్రతిపక్షాలు రెండూ బెంబేలెత్తుతున్నాయి. అందుకే ఈ కూటమి పట్ల ప్రజల్లో గందరగోళం
సృష్టించడానికి, వామపక్ష శ్రేణుల్లో అయోమయం నెలకొల్పడానికి విఫల యత్నాలు చేస్తున్నాయి. అటు రాష్ట్రంలోనూ, అటు దేశవ్యాపితంగానూ బిజెపి-తెలుగు దేశం ప్రభుత్వాల కాలంలో దళితులపై తీవ్రమైన దాడులు జరిగాయి. గుంటూరు జిల్లా గొట్టిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులలో దళితులపై జరిగిన దాడి సంఘటనలు తెలిసిందే. వామపక్షాలు ముఖ్యంగా సిపిఐ(ఎం) దళితులపై దాడులను ఖండించడమే కాక వారి పక్షాన పోరాటాలు చేశాయి. అందువల్ల రాష్ట్రంలో ఈ రెండు ప్రధాన పార్టీలైన టిడిపి, వైసిపి ల పట్ల దళితుల్లో ఆగ్రహం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు జనసేన, వామపక్షాల కూటమి వైపు చూస్తారని, వారికే ఓటేస్తారన్న అభిప్రాయం లెఫ్ట్‌ నేతల్లో ఉంది. ఈ కూటమిలోకి బిఎస్‌పి కూడా వచ్చి చేరడంతో ఈ కూటమి బలం పుంజుకుందన్న భావన ఏర్పడింది. సీట్ల సర్దుబాటు వామపక్షాలకు, జనసేనకు మధ్య కుదరడంతోబాటు మరో ముఖ్యమైన పార్టీ బిఎస్‌పి కూడా ఈ కూటమిలో కలవడం ఇప్పుడు అటు వైసిపికి, ఇటు టిడిపికి మింగుడు పడడం లేదు. దీంతో ఈ కూటమి ఏర్పాటు వెనక ఏదో కుట్ర దాగి వుందనీ చవుకబారు ప్రచారానికి దిగారు. జనసేన తెలుగు దేశం పార్టీకి బి-టీమ్‌లాగా వ్యవహరిస్తోందని, వామపక్షాలు దానితో చేరడమేమిటని ఇంకో వాదన ముందుకు తెస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అయితే తెలుగుదేశం, లేకుంటే వైఎస్‌ఆర్‌సిపి. అంతే తప్ప వేరే దారిలేదు అనే పరిస్థితిలో మార్పు వస్తున్నదనీ, రెండు పార్టీల వ్యవస్థ బీటలు వారుతోందనీ అర్ధమవుతుంది. నాలుగున్నరేళ్లు బిజెపితో చెట్టాపట్టాలు వేసుకు తిరిగిన టిడిపి, ఇప్పుడు అదే బిజెపితో చెలిమికి తహతహలాడుతున్న వైసిపి రెండూ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయని లెఫ్ట్‌ నేతలు ప్రచారం చేస్తున్నారు.  ఈ రెండు పార్టీల లాలూచీ కుస్తీకి చరమగీతం పాడి ప్రజల పక్షాన విధానపరమైన ప్రత్యామ్నాయాన్ని నిర్మించే క్రమంలో జనసేన, వామపక్షాలు, బిఎస్‌పి పొత్తు ఏర్పడింది. దీనికి ప్రజల నుండి మంచి స్పందన వస్తుండడంతో దుష్పాచ్రారానికి దిగుతున్నారు.  అసంఘటిత రంగ కార్మికులు, కౌలు రైతుల సమస్యల విూద, ఉపాధి హావిూ పథకం అమలు, రైతులకు గిట్టుబాటు ధరల కోసం, ఉద్యోగుల సిపిసికి వ్యతిరేకంగా, అంగన్‌వాడీలు, ఆశాలు, మున్సిపల్‌ వర్కర్లు, నిరుద్యోగ యువతీ యువకులు, మహిళలు ఒకటేమిటి సమస్యలెదుర్కొంటున్న అన్ని వర్గాల ప్రజల తరఫున సిపిఎం, వామపక్షాలు పోరాడాయి. ఈ పోరాటాలను ఎన్నికల్లో ఓట్ల రూపంలో సంఘటితం చేసుకోవాల్సి ఉంది.  జనసేన బిఎస్‌పిలతో కలిసి ఎన్నికల్లో ఒక బలమైన శక్తిగా మారినప్పుడు పోరాటాలను ఓట్ల రూపంలో సంఘటితం చేసుకోడానికి మంచి అవకాశం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక ¬దా, విభజన హావిూల అమలు తప్పని సరి. వాటి సాధన కోసం వామపక్షాలు నిరంతరం కృషి చేస్తాయి. బలవంతపు భూ సేకరణను వ్యతిరేకిస్తాయి. 42 కార్మిక చట్టాల అమలు కోసం పోరాడతాయి. అభివృద్ధి పేరుతో పర్యావరణ వినాశనాన్ని వ్యతిరేకిస్తాయి. యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమల కోసం పట్టుపడతాయి. ప్రభుత్వాలు ప్రజా సమస్యలపై పని చేసేలా ఒత్తిడి చేసే అంకుశం వామపక్షాలు. వామపక్ష పార్టీల ప్రతినిధులు అసెంబ్లీలో తిరిగి అడుగు పెడితేనే మెజారిటీ ప్రజల సమస్యలు ఆ సభలో చర్చకు వస్తాయి. చట్టసభల్లో వామపక్ష ప్రాతినిధ్యం ప్రజా ఉద్యమాలకు కొండంత అండగా వుంటుందని చెబుతోంది.