రాష్ట్రపతి కోవింద్‌కు పౌర సన్మానం

 

 

దేశానికి ఏపీ ఎంతో చేసింది

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ప్రతిభావంతులు

ఏపీ రైతులు దేశానికి అన్నం పెడుతున్నారు

భూపంపిణీ చేపట్టిన చంద్రబాబుకు అభినందనలు

తిరుపతి,సెప్టెంబర్‌ : దేశానికి ఏపీ ఎంతో సేవ చేసిందని రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ అన్నారు. ఎన్టీఆర్‌, పీవీ వంటి గొప్ప నేతలను దేశానికి అందించిందని ఆయన చెప్పారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం తిరుపతికి వచ్చిన రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ కు ఘన స్వాగతం లభించింది. రేణిగుంట విమానాశ్రయంలో గవర్నర్‌ నరసింహన్‌, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారులు తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పద్మావతి మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్‌ నైపుణ్య శిక్షణ కేంద్రానికి భూమిపూజ చేశారు. ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రపతి కోవింద్‌ కు ఘనంగా పౌర సన్మానం చేసింది. ఈ సందర్బంగా రాష్ట్రపతి కోవింద్‌కు వేదపండితుల ఆశీర్వచనాలు అందించారు. అనంతరం మాట్లాడుతూ విూ అందరికీ నమస్కారం అంటూ తెలుగువారిని పలకరించారు. రాష్ట్రపతి పదవి చేపట్టాక తన తొలి పర్యటన జమ్మూకాశ్మీర్‌ అని చెప్పారు. అయితే తన రెండో పర్యటన తిరుపతి కావడం సంతోషంగా ఉందన్నారు.

ఏపీ ప్రజలు ప్రతిభావంతులు అని ప్రశంసలు కురిపించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో శిక్షణ పొందితే నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు వస్తాయని ఆయన తెలిపారు. ఎస్సీలకు భూ పంపిణీ మంచి కార్యక్రమం అని వివరించారు. భూ పంపిణీ చేపట్టిన సీఎం చంద్రబాబును అభినందిస్తున్నానన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్రపతి కోవింద్‌ ఆకాంక్షించారు. ఆంధప్రదేశ్‌ రైతులు దేశానికి అన్నం పెడుతున్నారని కొనియాడారు. ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు కూడా ఏపీకే చెందినవారేనన్నారు. త్వరలోనే నవ్యాంధ్ర రాజధాని అమరావతిని సందర్శించనున్నట్టు చెప్పారు. పౌర సన్మానం అనంతరం రాష్ట్రపతి తిరుమల చేరుకున్నారు. నేడు ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకోనున్నారు.

రాష్ట్రపతి కోవింద్‌ ను ఆదర్శంగా తీసుకోవాలి-చంద్రబాబు

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఎన్నో కష్టాలు పడి ఉన్నతస్థాయికి ఆయన ఎదిగారని చెప్పారు. రాష్ట్రపతి కోవింద్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ తొలిసారి రాష్టాన్రికి వచ్చిన రాష్ట్రపతికి సన్మానం చేయడం తనకు ఆనందంగా ఉందన్నారు. అది కూడా తాను చదువుకున్న ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో నిర్వహించడం మరింత ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి రామ్‌నాథ్‌ కోవింద్‌ చిన్నతనంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారని సీఎం తెలిపారు. ఎన్నో ఉన్నత పదవులు అలంకరించారన్నారు. అలాంటి వ్యక్తిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పౌర సన్మాన కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌, మంత్రులు అచ్చెన్నాయుడు, లోకేశ్‌, అమర్‌నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.