కేజ్రీవాల్‌ సిద్ధాంతాలు తుంగలో తొక్కాడు

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అధికార వ్యామోహంలో పడి సిద్ధాంతాలన్నీ తుంగలో తొక్కారంటూ సామాజికవేత్త అన్నా హజారే నిప్పులు చెరిగారు. చట్టాలు, ఆర్థిక నియమాల ఉల్లంఘన సహా అనేక అంశాల్లో ఢిల్లీ సర్కారు తీవ్ర అవకతవకలకు పాల్పడిందంటూ షుంగ్లూ కమిటీ ఇచ్చిన నివేదికతో ఈ విషయం స్పష్టమైందని మహారాష్ట్రలోని రేలెగాన్‌ సిద్ధి నుంచి విడుదల చేసిన ప్రకటనలో ఆయన తెలిపారు. అరవింద్‌పై ఆరోపణలు చేస్తూ షుంగ్లూ కమిటీ ఇచ్చిన నివేదిక తనను ఎంతో బాధించిందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా తాను చేసిన పోరాటంలో అరవింద్‌ తన వెంట నడవడమే ఇందుకు కారణమన్నారు. అప్పట్లో అరవింద్‌పై తాను ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, అతనిలాంటి యువకులు, విద్యావంతులతో అవినీతి రహిత దేశంగా భారత్ ఆవిర్భవిస్తుందని స్వప్నించానన్నారు. రాజకీయ పార్టీ స్థాపించిన కేజ్రీవాల్‌తో తనను దూరంగా పెట్టినందుకు ఆ దేవుడికి ఎంతో రుణపడి ఉన్నానని హజారే వ్యాఖ్యానించారు. అరవింద్‌ సీఎం అయ్యాక తానెప్పుడూ అతడిని కలవాలని కోరుకోలేదని స్పష్టం చేశారు.