రాష్ట్రపతి రేసులో మురళీ మనోహర్‌ జోషి


దిల్లీ: వచ్చే ఏడాదితో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీ కాలం ముగియనుండటంతో ఆ తర్వాత భాజపా నుంచి ఎవరు రాష్ట్రపతి అవుతారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆ పదవి కోసం కొందరు భాజపా సీనియర్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ రేసులో మరో భాజపా సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషి పేరు సైతం చేరింది. ఇప్పటికే ఆయన ఈ పదవి కోసం, ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపా అగ్రనాయకులతో మంతనాలు జరుపుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

జోషీ ఈ విషయమై ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, పలువురు సీనియర్‌ భాజపా, సంఘ్‌ నేతల్ని కలిసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రపతి పదవి గురించి ఆయన వారితో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సంఘ్‌ నిర్ణయం సైతం కీలక పాత్ర పోషించనుంది. వారి నిర్ణయం ప్రకారమే ప్రధాని మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షాలు కలిసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేత దేవేంద్ర స్వరూప్‌ జోషీకి మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది.