రాష్ట్రవ్యాప్తంగా.. ఒకేఒక్క సైన్‌ఫ్లూ కేసు నమోదైంది
– జ్వరాలపై జూన్ నుంచి ఎప్పటికప్పుడు సమాయత్తమయ్యాం
– విష జ్వరాల తీవ్రతను తగ్గించేందుకు కృషి చేస్తున్నాం
– సెలవులు లేకుండా వైద్యులు పనిచేస్తున్నారు
– ప్రజల్లో జ్వరాల పట్ల భయంపెంచేలా ప్రచారం చేయోద్దు
– తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్
హైదరాబాద్, సెప్టెంబర్6 (జనం సాక్షి ) : రాష్ట్రంలో విష జ్వరాల తీవ్రతను తగ్గించేందుకు కృషిచేస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి ఈటెల రాజేందర్ సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాలుగు రోజులుగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా విష జ్వరాల తీవ్రతను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. డెంగీ లక్షణాలు కొంత మారాయని, గతంలో డెంగీ వస్తే చనిపోయేవారని, ఇప్పుడు తీవ్రత తగ్గిందన్నారు. రోగుల సంఖ్య పెరిగినా, త్వరగానే వ్యాధి నయమవుతోందని అన్నారు. ఫీవర్ ఆస్పత్రిలో 51వేల మందికి
పరీక్షలు చేస్తే 62మందికే డెంగీ ఉన్నట్లు తేలిందన్నారు. గాంధీ ఆస్పత్రిలో 419 మందికి వ్యాధి నయం చేసి పంపారని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ బోధన ఆస్పత్రుల్లో సాయంత్రం ఓపీ నిర్వహిస్తున్నామని ఈటెల తెలిపారు. సెలవు కూడా లేకుండా వైద్యులు పనిచేస్తున్నారని, మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. ప్రజల్లో జ్వరాల పట్ల భయం పెంచేలా ప్రచారం చేయోద్దని, దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలు కొనుగోలు చేయాలని నిర్ణయించామని అన్నారు. ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తే సమస్యల నుంచి బయటపడుతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఒక్క సైన్‌ఫ్లూ కేసు నమోదైందని, పాఠశాలల్లో ప్రాథమిక నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. జ్వరాలపై జూన్ నుంచి ఎప్పటికప్పుడు సమాయత్తమయ్యామని, ప్రజల భాగస్వామ్యం లేకుండా భారీ సమస్యలను ప్రభుత్వమే నివారించలేదన్నారు. అవసరమైన చోటు ఔట్‌సోర్స్ వైద్యులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతిరోజూ ప్రైవేటు ఆస్పత్రుల రోగుల నివేదికను డీఎంహెచ్‌వోకు పంపాలని ఆదేశించామని తెలిపారు. మూసీ పరిసరాల్లో నీరు నిలువ వల్ల వ్యాధులు ప్రబలుతున్నాయి. నీరు నిలువ ఉన్న ప్రాంతంలో దోమలు గుడ్లు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.