రాష్ట్రవ్యాప్తంగా కెటిఆర్‌ జన్మదిన వేడుకలు

మొక్కలు నాటి అభిమానం చాటుకున్న నేతలు

హైదరాబాద్‌,జూలై24(జ‌నంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి కేటీఆర్‌ బర్త్‌డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. కేటీఆర్‌ జన్మదిన వేడుకల్లో డిప్యూటీ సీఎం మహముద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. కేక్‌ కట్‌ చేసి సంబురాలు చేసుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ భవన్‌ వద్ద రోడ్డుకు ఇరువైపులా మంత్రులు మొక్కలు నాటారు. అనంతరం భవన్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో మాజీ మంత్రి దానం నాగేందర్‌ మొక్కలు నాటారు. హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కేటీఆర్‌ విశేష కృషి చేస్తున్నారని దానం నాగేందర్‌ కొనియాడారు. దేశ, విదేశాల్లో తెలంగాణ ఖ్యాతిని పెంచుతున్న ఘనత కేటీఆర్‌దే అని చెప్పారు. తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్రాభివృద్దిలో తనవంతు పాత్రపోషిస్తున్న మంత్రి కేటీఆర్‌ బర్త్‌ డే వేడుకలను ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు ఘనంగా నిర్వహించారు. కూకట్‌ పల్లి నియోజకవర్గం బాచుపల్లితో పాటు కొంపల్లిలో ఘనంగా వేడుకలను ఏర్పాటు చేశారు. 15 వేల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌ రెడ్డితో పాటు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, గాదరి కిషోర్‌, వివేకానంద్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు, భారీ ఎత్తున టీఆర్‌ ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

కెటిఆర్‌కు లోకేశ్‌ శుభాకాంక్షలు

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాదు ఈ ప్రత్యేకమైన రోజు ప్రతీక్షణం ఆనందంతో నిండిపోవాలని కోరుకుంటున్నానంటూ మంత్రి లోకేష్‌ ట్వీట్‌ చేశారు. మరోవైపు ట్విట్టర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖులు, అభిమానులు కార్యకర్తలు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి హరీష్‌రావు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు, సినీనటులు మహేష్‌బాబు, ఈషారెబ్బ, డైరెక్టర్‌ హరిశంకర్‌, వంశిపైడిపల్లి తదితరులు మంత్రి కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. డైనమిక్‌, అధ్భుతమైన నాయకుడు, యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ రాష్ట్రం కోసం కష్టపడుతున్న వ్యక్తి కేటీఆర్‌ అంటూ ట్వీట్‌ చేశారు.

కెటిఆర్‌ కృతజ్ఞతలు

తన పుట్టిన రోజు సందర్భంగా శుభకాంక్షలు తెలిపిన వారందరికీ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా ధన్యవాదాలు చెప్పారు. పుట్టిన రోజు సందర్భంగా వివిధ రూపాల్లో నాకు శుభాకాంక్షలు అందించిన.. పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. విూ అందరినీ వ్యక్తిగతంగా కలవాలని ఉన్నది కానీ.. గత ఆదివారం నుంచి జ్వరం ఉండటం వల్ల కలవడం కుదరడంలేదు. మరోసారి విూ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అని తెలిపారు.