రాష్ట్రాన్ని దొంగలు పాలిస్తున్నరు..


పదవి కోసమే సీఎం ఢిల్లీ చక్కర్లు శ్రీఅవినీతి మంత్రులకు కిరణ్‌ అండ
తెలంగాణపై కాంగ్రెస్‌వన్నీ అబద్ధాలే..
ప్రజా పోరు యాత్రలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ
వేములవాడ, సెప్టెంబర్‌ 1, (జనంసాక్షి) : రాష్ట్రంలో దొంగల పాలన సాగుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణపై పూటకో మాట మాట్లాడుతూ ఇక్కడి ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సీపీఐ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా పోరు యాత్ర శనివారం ఉదయం వేములవాడకు చేరుకుంది. యాత్రలో విచ్చేసిన నారాయణ, ఇతర పార్టీ నాయకులకు విద్యార్థులు, తెలంగాణవాదులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నారాయాణ యాత్రో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ాగా అవినీతిలో కూరుకుపోయిన తనమంత్రులను కాపాడుకోవడంతోపాటు తన పదవిని నిలబెట్టుకోవడానికే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యల్ని గాలికొదిలేసిన ముఖ్యమంత్రికి పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని నారాయణ విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ సాధించే వరకూ నిర్ధిష్ట కార్యాచరణతో తమ పార్టీ ఉద్యమాలు చేపడుతుందని పేర్కొన్నారు. తెలంగాణా వనరులను దోచుకుంటున్న సీమాంధ్ర పాలకుల చెర నుండి విముక్తి కావడానికి ప్రత్యేక రాష్ట్రం అత్యంత ఆవశ్యకమని ఆయన ఉద్ఘాటించారు. అంతకు ముందు నారాయణతోపాటు పార్టీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్‌, జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి జిల్లా నాయకులు ఎం.డి.మౌలానా, ఎన్‌.రామయ్య, చేర్ని విశ్వనాథం, ఎం.డి. ముకర్రం తదితరులతో కలిసి వందలాది కార్యకర్తలు తిప్పాపురం బస్టాండ్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం విద్యార్థుల కోలాటాలు, ఆటపాటల మధ్య అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు తిరుమల్‌గౌడ్‌, బొజ్జ కనకయ్య, సోమినేని బాలు, రోమాల ప్రవీణ్‌కుమార్‌, కె.రాజేందర్‌, రాజశేఖర్‌రెడ్డి, ఎల్ల పోచెట్టి, గాజర్ల బుగ్గయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎర్రం మహేశ్‌, ఈర్లపెల్లి రాజు, పాషా, విద్యార్థి నాయకులు నిమ్మశెట్టి విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.