రాష్ట్రావతరణ దినోత్సవాన్ని విద్రోహదినంగా పాటిద్దాం
నిజామాబాద్, అక్టోబర్ 31 : గురువారంనాడు ఎపి అవతరణ దినోత్సవాన్ని విద్రోహదినంగా పాటిద్దామని తెలంగాణ జిల్లా జేఏసీ చైర్మన్ గోపాలశర్మ, కన్వీనర్లు గంగారాం పిలుపునిచ్చారు. బుధవారం టిఎన్‌జిఓస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం కావాలని రెచ్చగొట్టే విధంగా ఉత్సవాలు జరుపుకుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీమాంధ్ర ప్రాంతంలో విలీనం చేయరాదని పజల్ అలీ కమిషన్ ఇచ్చిన నివేదికను కాదని బలవంతంగా సీమాంధ్రను తెలంగాణలో విలీనం చేయడం విద్రోహదినంగా పాటించాలని కోరారు. గ్రామాలు, మండలాలు, డివిజన్లలో నల్లబ్యాడ్జీలు, నల్లజెండాలు, నల్లదుస్తులు ధరించి ప్రభుత్వాలకు నిరసన తెలపాలని, ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వ ఉత్సవంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు పాల్గొనవద్దని పిలుపునిచ్చారు. ఉద్యోగులు అవార్డులు, రివార్డులు తిరస్కరించాలని కోరారు. ఈ సమావేశంలో భాస్కర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.