రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
హైదరాబాద్,సెప్టెంబర్9 (జనంసాక్షి):
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.114 శాతం డీఏను పెంచుతూ తెలంగాణ సర్కారు జీవో విడుదల చేసింది. కేంద్రం ఉద్యోగుల డీఏను ఆరు శాతం పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. పెంచిన డీఏను ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నట్టు పేర్కొన్నది. పెరిగిన డీఏను సెప్టెంబర్ నెల వేతనంలో కలిపి ఇస్తామని పేర్కొంది.ఇప్పటికే, ఉద్యోగుల మూలవేతనంలో డీఎ 8.908 శాతం ఉండగా .. దానిని 12.052శాతానికి పెంచింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్స్, వ్యవసాయ మార్కెట్ కమిటీ, జిల్లా గ్రంథాలయ సంస్థ, వర్క్ చార్జ్ డ్ సంస్థల ఉద్యోగులకు కూడా పెంచిన డీఏ వర్తిస్తుంది.ఎయిడెడ్ విద్యా సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్ సంస్థల టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా ఈ డీఏ పెంపుదల ఉందని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. వీరితో పాటు ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం, జేఎన్టీయు హైదరాబాద్ లోని టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు కూడా ఈ పెంపుదల వర్తిస్తుందని వివరించింది. పార్ట్ టైమ్ అసిస్టెంట్లు, విఆర్‌ఏలకు నెలకు 100 రూపాయల వేతనం పెంచుతున్నట్లు కూడా ప్రభుత్వం జీవోలో పేర్కొన్నది.