రాష్ట్ర ప్రయోజనాలపై రాజీవద్దు

C

– హైకోర్టు, నిధులపై గళం విప్పండి

– సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం

హైదరాబాద్‌,జులై 17(జనంసాక్షి):రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, సమస్యలపై జాతీయ స్థాయిలో పోరుకు టీఆర్‌ఎస్‌ సిద్ధమౌతోంది. సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలోఉండటం, అలాగే వర్షాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానుండటంతో.. అక్కడ పార్టీ ఎంపీలతో సమావేశం అయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన విధానాన్ని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. జాతీయ స్థాయిలో జీఎస్టీ లాంటి బిల్లులకు మద్దతునిస్తూనే.. తెలంగాణ రాష్ట్ర సమస్యలపై సీరియస్‌ గా గళం వినిపించాలని సీఎం సూచించారు. ఇక పార్లమెంటు సెషన్స్‌ లో హైకోర్టు విభజన మొదటి ప్రాధాన్యాతాంశంగా ఉండనుంది. అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను రావాల్సిన కేంద్రసహాయంపై పార్లమెంటు వేదికగా ఎంపీలు తెలంగాణ వాణిని వినిపించనున్నారు.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పార్లమెంటులో తమ వైఖరి ఉంటుందని ఎంపీలు జితేందర్‌ రెడ్డి, వినోద్‌ కుమార్‌ చెప్పారు. వెంటనే హైకోర్టును విభజించాలనే డిమాండ్‌ ను పార్లమెంటులో వినిపిస్తామని ఎంపీ జితేందర్‌ రెడ్డి చెప్పారు. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయాన్ని లేవనెత్తుతామని తెలిపారు. కేంద్రం స్పందనను బట్టి తమ వ్యూహం ఉంటుందన్నారు. అటు ప్రతీ బిల్లు, మెరిట్స్‌ పై ఇష్యూ బేస్డ్‌ సపోర్టునివ్వాలని నిర్ణయించినట్లు ఎంపీ వినోద్‌ కుమార్‌ తెలిపారు. జీఎస్టీ బిల్లుకు రాజ్యసభలో సంపూర్ణ మద్దతునిస్తామని చెప్పారు. ఇక రేపు మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు. ముఖ్యంగా హైకోర్టు విభజనతోపాటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు.