రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): సూర్యాపేటలో నవంబర్ 20న జరిగే తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘ రాష్ట్ర ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర కోశాధికారి గంటా నాగయ్య పిలుపునిచ్చారు.గురువారం జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆ సంఘ రాష్ట్ర నాయకులు వై.గోపాల్ రావు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు మేడే లోపు కేసీఆర్ ప్రభుత్వం బైక్ ల పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందారని విమర్శించారు.భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో నిర్దిష్టంగా సెస్ ను వసూలు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని అన్నారు.సంక్షేమ బోర్డులోని నిధులను భవన నిర్మాణ కార్మికులకు ఖర్చు చేయకుండా ఇతర పథకాలకు మళ్లింపు చేయడాన్ని వ్యతిరేకించారు. పెండింగ్ లో ఉన్న క్లయిమ్ లను మంజూరు చేయాలని, 60 ఏళ్ళు5 పైబడిన ప్రతి కార్మికుడికి పెన్షన్ రూ.6 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేబర్ కార్డు పొందిన ఐదేళ్ల తర్వాత రెన్యువల్ చేయించుకోకపోవడంతో అనేక మంది కార్మికులు చనిపోయిన ఆ సంక్షేమ పథకాలను లబ్ది పొందలేకపోతున్నారని,రెన్యువల్ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు.పై సమస్యల పరిష్కారం కై జాతీయ కోఆర్డినేషన్ కమిటీ పిలుపుమేరకు నేడు లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాలు, నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో నాయకులు, దేసోజు మధు , టి.లక్ష్మయ్య , ఎండి జబ్బార్ , డి.వీరస్వామి , పి.వెంకన్న , మైసయ్య , శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.