రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): ఈ నెల 19న యాదగిరి గుట్టలో జరిగే తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర మూడవ మహాసభ , భారీ ప్రదర్శనను జయప్రదం చేయాలని ఆ సంఘ జిల్లా సహాయ కార్యదర్శి గునగంటి కృష్ణ అన్నారు.ఆదివారం మహాసభకు సంబంధించిన పోస్టర్లను గీత కార్మికులతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.కల్లు గీత కార్మికులకు రాష్ట్ర బడ్జెట్ లో 5వేల కోట్ల రూపాయలు కేటాయించాలన్నారు. 560 జీఓ అమలు చేయాలని, ప్రతి కల్లు గీత సొసైటీకి 5 ఏకరాల భూమిని కేటాయించాలని కోరారు. అందులో తాటి,ఈత, ఖర్జూర చెట్లను నాటి, వాటి సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వమే ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించాలన్నారు.గీతన్న పద్దు ప్రవేశపెట్టి ప్రతి కల్లు గీత కార్మికులకు కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని కోరారు. కల్లులోని పోషకాలను ఔషధ గుణాలను ప్రభుత్వమే ప్రచారం చేయాలన్నారు.కల్లుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని, సభ్యత్వం కలిగి ఉన్న కార్మికులకు ఉచితంగా బైక్ లు ఇవ్వాలన్నారు.ప్రతి జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలను ప్రతిష్టించాలన్నారు.మెడికల్ బోర్డు నిబంధన తొలగించాలని, ప్రతి జిల్లాలో నీర ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని, ప్రమాదవశాత్తు తాడిచెట్టుపై పడి వికలాంగులైతే రూ.5 లక్షలు, చనిపోయినవారికి రూ.10 లక్షలు తక్షణమే ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నకిరేకంటి శ్రీనివాస్, సోమగాని బాలరాజు, బొమ్మగాని మారయ్య , గునగంటి సైదులు , తండు శ్రీనివాస్, భూపతి అంజయ్య, దేషగాని వెంకన్న, నాగయ్య, భూపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.