రాష్ట్ర సెమినార్ ను జయప్రదం చేయండి
– జిల్లా సహాయ కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్ హుజూర్ నగర్ నవంబర్ 11 (జనం సాక్షి): ఈనెల 15 న హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జరిగే “గ్రామీణ ఉపాధి చట్టం అమలు – సవాళ్లు ” అనే అంశంపై నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సెమినార్ లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులు, మెట్లు, ఉపాధి హామీలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్ పిలుపునిచ్చినారు. శుక్రవారం మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో ఈనెల 15న హైదరాబాదులో నిర్వహిస్తున్న రాష్ట్ర సెమినార్ గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 సంవత్సరం కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అండగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలనే కుట్ర చెస్తుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కొటి ముప్పై లక్షలకు పైగా కూలీలు గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తూ తమ కుటుంబాలను పోషించు కుంటున్నారన్నారు. కానీ బిజెపి ప్రభుత్వం ప్రతి బడ్జెట్ లో జాతీయ గ్రామీణ ఉపాధి చట్టానికి నిధులు తగ్గిస్తూ దేశవ్యాప్తంగా నిరుపేదలకు ఆదాయము, ఆహార భద్రత కల్పిస్తున్నా చట్టాన్నె రద్దు చేసే కుట్రలకు పాల్పడుతుందని అన్నారు. ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్న కూలీలకు సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని, రోజు వేతనము రూ.600 ఇవ్వాలని, మేట్లకు గుర్తింపు కార్డులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించి, జీతభత్యాలు పెంచాలని కోరుతూ చట్ట పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ సెమినార్ కు ముఖ్య అతిథులుగా రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు , కేరళ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, లోకల్ బాడీస్ శాఖ మంత్రివర్యులు ఎంబి రాజేష్ , అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు పాల్గొంటున్నారని జాతీయ గ్రామీణ ఉపాధి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సెమినారును జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తంగేళ్ల గోపరాజు, మండల కమిటీ సభ్యురాలు శశికళ, తంగెళ్ల వెంకట చంద్ర, నూకల లక్ష్మీ, నరసమ్మ, మాడూరి నరసింహ చారి, పారుపల్లి శ్రీనివాస్, కట్ట కృష్ణారావు , జింకల గోపి, కుక్క డప్పు స్వామి, తేనె సీతారాములు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.