రాహుల్‌కు త్వరలో పట్టాభిషేకం

– ధృవీకరించిన సోనియా

ఢిల్లీ,అక్టోబర్‌ 14,(జనంసాక్షి):కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మౌనం వీడారు. రాహుల్‌ పదోన్నతిపై ఆమె స్పందించారు. ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. త్వరలో ఆ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ అంశాన్ని సోనియా గాంధీ స్పష్టం చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ బయోగ్రఫీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శుక్రవారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేఖరులు ఆమెను రాహుల్‌ గురించి అడిగారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ బాధ్యతలు స్వీకరిస్తారని ఇటీవల వార్తలు వస్తున్న నేపథ్యంలో సోనియా కూడా ఆ ప్రశ్నలకు స్పందించారు. పార్టీ చీఫ్‌గా రాహుల్‌కు పదోన్నతి త్వరలోనే జరుగుతుందని సోనియా తెలిపారు. ఇదే విషయాన్ని విూరు ఎన్నో ఏళ్లుగా అడుగుతున్నారని, ఇప్పుడు ఆ సమయం ఆసన్నమవుతున్నట్లు సోనియా సంకేతాలిచ్చారు. రాహుల్‌ను కాంగ్రెస్‌ చీఫ్‌గా ఎన్నుకునేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను సెంట్రల్‌ కమిటీ చైర్మన్‌ ముల్లపల్లి రామచంద్రన్‌ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే ఆయన సమర్పించే షెడ్యూల్‌ ప్రకారం.. త్వరలో సోనియా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాతే రాహుల్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకునే ప్రక్రియ మొదలవుతుంది. పార్టీలో జరిగే వ్యవస్థాగత ఎన్నికల ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నట్లు కూడా తెలుస్తున్నది. అన్ని రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌ సంఘాలు.. రాహుల్‌కు అనుకూలంగా తీర్మానం ఆమోదించాయి. ఈనెల చివర్లో కానీ లేదా నవంబర్‌ మొదటి వారంలో రాహుల్‌.. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి.