రాహుల్‌ ద్రవిడ్‌కు ఐసీసీ అరుదైన గౌరవం

– ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ద్రవిడ్‌కు చోటు
– భారత్‌ నుంచి ఐదోవాడిగా ద్రవిడ్‌
డబ్లిన్‌, జులై2(జ‌నం సాక్షి ) : భారత మాజీ క్రికెటర్‌, ది వాల్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు ఐసీసీ నుంచి అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ క్రికెట్లో విశేష ప్రతిభ కనబరచడంతో పాటు, క్రికెట్‌కు విశేష సేవలు అందిస్తోన్న వారికి ‘ఐసీసీ క్రికెట్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ పేరిట పురస్కారాలను అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఐసీసీ ఈ ఏడాది హాల్‌ ఆప్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న క్రికెటర్ల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో భారత్‌ నుంచి రాహుల్‌ ద్రవిడ్‌ చోటు దక్కించుకున్నాడు. ఈ మేరకు ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఐసీసీ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. భారత అండర్‌-19, భారత-ఎ జట్లకు ప్రస్తుతం కోచింగ్‌ బాధ్యతలు నిర్వహిస్తోన్న ద్రవిడ్‌ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయాడు. ద్రవిడ్‌తో పాటు ఆస్టేల్రియాకు వరుసగా మూడు ప్రపంచకప్‌లు అందించిన ఏకైక సారథి రికీ పాంటింగ్‌, ఇంగ్లాండ్‌ మాజీ క్రీడాకారిణి క్లేరీ టేలర్‌ కూడా ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. భారత్‌ నుంచి హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న ఐదో ఆటగాడు ద్రవిడ్‌. రికీ పాంటింగ్‌ ఆసీస్‌ నుంచి 25వ వాడు కాగా ఇంగ్లాండ్‌ నుంచి మూడో క్రీడాకారిణి టేలర్‌. ఈ సందర్భంగా ద్రవిడ్‌ మాట్లాడుతూ.. ‘ఐసీసీ క్రికెట్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఐసీసీ, బీసీసీఐకి ధన్యవాదాలు. క్రికెట్‌లో రాణించేందుకు సాయపడిన, ప్రోత్సహించిన నా కుటుంబసభ్యులు, స్నేహితులు, సహచర ఆటగాళ్లు, కోచ్‌లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు. కోచింగ్‌ బాధ్యతలు, కొన్ని కమిట్‌మెంట్స్‌ వల్ల నేను ఈ కార్యక్రమానికి రాలేకపోయాను’ అని తెలిపాడు ద్రవిడ్‌. 1996లో భారత జట్టు తరఫున అంతర్జాయతీ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రాహుల్‌ ద్రవిడ్‌ 2012లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.