రాహుల్‌ అఫిడవిట్‌ సమర్పించండి

పార్టీలపై ఈసీ ఎలాంటి వివక్ష చూపదు
` మీడియా సమావేశంలో సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌
న్యూఢల్లీి(జనంసాక్షి):ఎన్నికల సంఘానికి ఎలాంటి భేదభావాలు ఉండవని, అన్ని పార్టీలను సమానంగా చూస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు.ఓటు చోరీ పేరుతో కొందరు అనవసర అనుమానాలు లేవనెత్తుతున్నారని ఆక్షేపించారు. బిహార్‌లో ఓటరు జాబితా సమగ్ర సవరణపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించిన సీఈసీ.. రాజ్యాంగ సంస్థలను అవమానించడం సరికాదన్నారు. ఓటరు జాబితాను బూత్‌ లెవల్‌లోనే ప్రతి పార్టీ చూసుకుంటుందన్నారు. సంస్కరణల్లో భాగంగానే ఓటరు జాబితాను సవరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ‘’బిహార్‌లో ఎస్‌ఐఆర్‌పై కొన్ని పార్టీలు, సంబంధిత నేతలు అసత్య ప్రచారం చేయడం తీవ్ర ఆందోళనకరం. ఎన్నికల సంఘం భుజాల పైనుంచి కొన్ని రాజకీయ పార్టీలు దాడులు చేస్తున్నాయి. బిహార్‌ ఓటరు ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని అన్ని రాజకీయ పార్టీలకు సూచిస్తున్నాం. బూత్‌ స్థాయి అధికారులు, ఏజెంట్లు పారదర్శకంగా ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు’’ అని సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు.‘’డబుల్‌ ఓటింగ్‌, ఓటు చోరీ ఆరోపణలకు ఎన్నికల సంఘం కానీ, ఓటరు భయపడే ప్రసక్తే లేదు. కోటి మందికిపై ఉద్యోగులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఇంత పారదర్శకంగా చేపట్టిన కార్యక్రమంలో ‘ఓటు చోరీ’ ఎలా సాధ్యమవుతుంది..? ఆధారాలు లేకుండా జాబితా నుంచి ఓటరు పేరు తొలగించం. ప్రతిఒక్క ఒటరుకు ఈసీ దన్నుగా నిలుస్తుంది.’’ అని సీఈసీ స్పష్టం చేశారు. ‘’సవరణ ప్రక్రియ హడావుడిగా చేస్తున్నామన్నది అవాస్తవం. ప్రతి ఎన్నికల ముందు ఓటరు జాబితాను సరిచేయడం ఎన్నికల సంఘం విధి. ఓటరు జాబితాలను సవరించేందుకు దేశంలో ఇప్పటివరకు 10 సార్లకుపైగా సవరణలను చేపట్టాం. పశ్చిమ బెంగాల్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ను నిర్ణీత సమయంలో ప్రకటిస్తాం. ఓటరు జాబితాలో అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్‌ 1లోగా తెలియజేయాలని గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలను అభ్యర్థిస్తున్నా’’ అని ఎన్నికల ప్రధాన కమిషనర్‌ వెల్లడిరచారు.
ఈసీ వ్యాఖ్యలు హాస్యాస్పదం: కాంగ్రెస్‌
తమకు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలనే తేడా ఉండదని ఎన్నికల సంఘం చెప్పడాన్ని కాంగ్రెస్‌ హాస్యాస్పదంగా పేర్కొంది. రాహుల్‌ గాంధీ లేవనెత్తిన ఏ ప్రశ్నకూ సీఈసీ అర్థవంతంగా సమాధానం ఇవ్వలేకపోయారని విమర్శించింది. ఈసీ సొంత డేటా ద్వారా వెల్లడైన వాస్తవాలను మాత్రమే రాహుల్‌ ప్రస్తావించారని గుర్తుచేసింది. బిహార్‌ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై సుప్రీంకోర్టు ఇటీవల జారీ చేసిన ఆదేశాలను ఈసీ అక్షరాలా అమలు చేస్తుందా? అని పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా ప్రశ్నించారు. ఈసీ వైఖరి దాని అసమర్థతను మాత్రమే కాకుండా, పక్షపాతాన్ని కూడా పూర్తిగా తేటతెల్లం చేసిందని ఆరోపించారు.