రిజర్వేషన్లను అడ్డుకుంటారా.. 

– దేశంలో ఇలాంటి దిక్కుమాలిన ప్రతిపక్షం లేదు
– టీడీపీ సభ్యులపై మండిపడ్డ ఏపీ సీఎం జగన్‌
అమరావతి, జులై22(జ‌నంసాక్షిఎ) : ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరుపట్ల సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఇలాంటి ప్రతిపక్షాన్ని ఎక్కడా చూడలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్యే బిల్లలను సభ ఆమోదించింది. ఏపీ సభలో ప్రభుత్వం పలు బిల్లును ప్రవేశపెట్టింది. నామినెటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పనుల్లో 50శాతం పూర్తిగా మహిళలకు కేటాయించడం, పర్మినెట్‌ బీసీ కమిషన్‌ బిల్లు, 70శాతం లోకల్‌ రిజర్వేషన్‌ బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తీసుకొచ్చింది. దీంతో సభ్యులు తమతమ అభిప్రాయాలను తెలిపారు. కాగా తమకు మరో అవకాశం ఇవ్వాలని టీడీపీ పట్టుబట్టింది. గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పలు తీర్మానాలను ఆమోదించే సమయంలో టీడీపీ నేతలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. క్లారిఫికేషన్‌ కోసం కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిసిన ప్రతిపక్షం ఇలా చేయడం దారుణమని అధికార పక్షం పేర్కొంది. అయినా కూడా అరగంట సేపు మాట్లాడిన తర్వాత ఆందోళన చేయడం సబబు కాదని తెలిపింది. దీంతో సీఎం జగన్‌ జోక్యం చేసుకున్నారు. 40 సంవత్సరాల ఇండస్టీ అంటారు..స్టేట్‌ మెంట్‌ ప్రభుత్వం నుంచి ఇచ్చినప్పుడు.. క్లారిఫికేషన్‌ కోసమే అనుమతి ఉంటుందని తెలిసినా.. ఏకంగా అరగంట పాటు మాట్లాడారని జగన్‌ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎలా వ్యవహరించారో గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పనుల్లో 50శాతం పూర్తిగా మహిళలకు ఇస్తున్నట్లు, 70శాతం లోకల్‌ రిజర్వేషన్లతో పాటు పర్మినెంట్‌ బీసీ కమిషన్‌ బిల్లులను తీసుకొస్తున్నామని, దేశ చరిత్రలో ఇలా జరగలేదన్నారు. ఇలాంటి బిల్లును అడ్డుకుంటున్న దిక్కుమాలిన ప్రతిపక్షం ఎక్కడా లేదన్నారు. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, ప్రతిపక్షాలకు జ్ఞానోదయం రావాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్‌ వెల్లడించారు.