రియాలిటీ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఫీజు కట్టి జైలు శిక్ష అనుభవించొచ్చు

636077180734502066హైదరాబాద్ : రియాలిటీ ఎక్స్‌పీరియెన్స్ కోసం చాలా మంది తహతహలాడుతూ ఉంటారు. అయితే జైలు శిక్ష పడాలని ఎవరూ కోరుకోరు. ఒక వేళ అలాంటి కోరిక ఉంటే మెదక్‌ జిల్లాలోని సంగా రెడ్డి జైలులో ఓ గదిని ఒక రోజు అద్దెకు తీసుకోవచ్చు.
సంగారెడ్డిలోని జిల్లా జైలును మ్యూజియంగా మార్చారు. జైలు అధికారులు మాట్లాడుతూ ‘ఫీల్ ది జైల్‘ అనే వినూత్న కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. స్వేచ్ఛను అర్థం చేసుకోవాలనుకునేవారు రూ.500 చెల్లించి ఇక్కడి గదిని ఒక రోజు అద్దెకు తీసుకోవచ్చునని తెలిపారు. వీరికి 24 గంటలపాటు నిర్బంధాన్ని రుచి చూపిస్తామన్నారు.
మహిళల బ్యారక్‌లో నిర్బంధాన్ని అనుభవించాలనుకొనేవారికి సాధారణ ఖాదీ వస్త్రాలు, చొక్క, షార్ట్స్ లేదా ట్రౌజర్స్, బెడ్డింగ్, స్టీల్ ప్లేట్, స్టీల్ గ్లాసు, స్టీల్ మగ్గు, వాషింగ్ సోప్, టాయ్‌లెట్ సోప్ ఇస్తామన్నారు. ఆహారం కూడా జైలు పద్ధతిలోనే ఉంటుందన్నారు. ఫ్యాను సదుపాయం కల్పిస్తామన్నారు. ఉదయం 6 నుంచి 6.30 గంటల మధ్యలో టీ ఇస్తామన్నారు. ఉదయం 7 నుంచి 7.30 గంటల మధ్యలో అల్పాహారాన్ని అందజేస్తామన్నారు. ఉదయం పదిన్నర నుంచి 11 గంటల మధ్యలో మధ్యాహ్నం భోజనం పెడామన్నారు. మధ్యాహ్నం 12 నుంచి 12.30 గంటల మధ్యలో మరోసారి టీ ఇస్తామన్నారు. టీని స్థానికంగానే తయారు చేస్తామని, ఇతర ఆహారం కందిలోని జిల్లా జైలు నుంచి వస్తుందని తెలిపారు. బ్రేక్ ఫాస్ట్‌లో చపాతీగానీ, చిత్రాన్నం కానీ పెడతామన్నారు. మధ్యాహ్న భోజనంలో కందిపప్పు, రసం, రాత్రి భోజనంలో రసం, కూర, పెరుగు పెడతామని పేర్కొన్నారు. జైలులో పనిచేయనక్కర్లేదని, మొక్కలు నాటవచ్చునని చెప్పారు.
జైలు మ్యూజియంను తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి జూన్ 5న ప్రారంభించారు. ఆ మరుసటి రోజు నుంచి ఇప్పటి వరకు 550 మంది సందర్శించారు. జైలు సందర్శకులకు పెద్దలకు రూ.10, పిల్లలకు రూ.5 చొప్పున వసూలు చేస్తు్న్నారు.