రిలయన్స్ జియో మైక్రో స్వైపింగ్

jio-1పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా క్యాష్‌లెస్ విధానాన్ని అమల్లోకి తెచ్చి నల్లధనాన్ని నియంత్రించొచ్చని ప్రధాని మోదీ భావిస్తున్నారు. ఇప్పటికే డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీకి ఏపీ సీఎం సారథ్యం వహిస్తున్నారు. అయితే ఇప్పుడున్న నోట్ల కష్టాలను గ్రామాల్లో తగ్గించేందుకు మైక్రో ఏటీఎం కార్డులను ఇప్పటికే కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. అయితే వీటివల్ల నోట్ల కష్టాలు తీరుతున్నాయో లేదో తెలియదు కానీ రిలయన్స్ జియో కూడా ఈ విధానం ద్వారా ప్రజలకు మరింత చేరువకావాలని భావిస్తోంది. వాకింగ్ ఏటీఎం పేరుతో మైక్రో స్వైపింగ్ మెషిన్లను అందుబాటులోకి తేవాలని ముఖేష్ అంబానీ భావిస్తున్నారు. ఆధార్ కార్డు నెంబర్ సాయంతో ఈ జియో మైక్రో ఏటీఎంలు పనిచేస్తాయి. దీని ద్వారా ఇంటి దగ్గరకు, పొలాల దగ్గరకెళ్లి గ్రామీణ ప్రాంత ప్రజలకు డబ్బునందించాలని జియో యోచిస్తోంది. బ్యాంకు అకౌంట్ లేని వారికి కూడా ఆధార్ కార్డ్ వివరాలు నమోదు చేసుకుని, వేలిముద్రలు తీసుకుని అకౌంట్ ఓపెన్ చేసే సదుపాయం కూడా కల్పించనున్నారు. అయితే ఇవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో జియో యాజమాన్యం అధికారికంగా ప్రకటించలేదు.