రీకౌంటింగ్‌ పై మండిపడ్డ ట్రంప్

1-trumpఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రీకౌంటింగ్‌ దుమారం కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ స్వల్ప తేడాతో గట్టెక్కిన విస్కాన్సిన్‌ రాష్ట్రంలో రీకౌంటింగ్‌కు ఎన్నికల సంఘం అంగీకరించడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకవైపు రీకౌంటింగ్‌కు అంగీకరించడాన్ని ట్రంప్‌ తీవ్రస్థాయిలో తప్పుబడుతుండగా.. మరోవైపు ఓడిపోయిన హిల్లరీ క్లింటన్‌ వర్గం దీనిపై ఆశల్లో తేలియాడుతోంది. విస్కాన్సిన్‌ రాష్ట్రంలో చేపట్టే రీకౌంటింగ్‌ ప్రక్రియలో తాము కూడా పాల్గొంటామని హిల్లరీ ప్రచార అధికారి ఒకరు శనివారం స్పష్టం చేశారు.రీకౌంటింగ్‌ ఒక స్కాం అని, గ్రీన్‌ పార్టీ తమ ఖజానాను నింపుకోవడానికే రీకౌంటింగ్‌ను తెరపైకి తెచ్చిందని డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విట్టర్‌లో మండిపడ్డారు. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి.. నైతికంగా దివాళా తీసిన డెమొక్రాట్లు దీనికి మద్దతు తెలుపుతున్నారని మండిపడ్డారు. రీకౌంటింగ్‌ వల్ల గెలుపు వరిస్తుందేమోనన్న తప్పుడు ఆలోచనతో డెమొక్రాట్లు ఉన్నారని సీరియస్‌ అయ్యారు.