రీపోలింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు రానివ్వద్దు

– కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయండి
– కలెక్టర్‌లను ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది
– కడపలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్ర ప్రదర్శన ఈసీ ఆగ్రహం
– రెండు థియేటర్‌ల అనుమతి రద్దుకు నోటీసులు జారీ
అమరావతి, మే3(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో ఈ నెల 6న నిర్వహించే రీపోలింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది తెలిపారు. శుక్రవారం ఆయా జిల్లాల్లో ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. 6న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు రీపోలింగ్‌ నిర్వహించనున్నట్టు ద్వివేది స్పష్టంచేశారు. రీపోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈవీఎంలలో ఏవైనా సమస్యలు తలెత్తితే బెల్‌ ఇంజినీర్లతో పాటు అదనపు ఈవీఎంలను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. రీ పోలింగ్‌ సమయంలో ఎక్కడా ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా, పోలింగ్‌ బూత్‌ల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌లను ఆదేశించారు. ఐదు పోలింగ్‌ బూత్‌ల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. అదనపు ఈవీఎంలు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. శ్రీకాకుళంలో వర్షాల వల్ల  స్ట్రాంగ్‌ రూమ్‌లకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, తుఫాన్‌ కారణంగా నాలుగు జిల్లాలకు ఎన్నికల కోడ్‌ నుంచి సీఈసీ మినహాయింపు ఇచ్చిందని పేర్కొన్నారు. కౌంటింగ్‌ పక్రియ కోసం ఈ నెల 7న సిబ్బందికి  ట్రైనింగ్‌ ఇస్తున్నామని వెల్లడించారు. ఇదిలా ఉంటే ఏపీలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం విడుదలకు సంబంధించి ఏప్రిల్‌ 10 తేదీన ఈసీ విడుదల చేసిన ఉత్తర్వులు అమల్లో వున్నప్పటికీ కడప జిల్లాలోని రెండు థియేటర్లలో ఆ సినిమా ప్రదర్శనపై ద్వివేది ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై కలెక్టర్‌ నుంచి నివేదిక వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది చెప్పారు. సంబంధిత థియేటర్లపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్ర ప్రదర్శన అడ్డుకోవడంలో జాయింట్‌ కలెక్టర్‌ విఫలమయ్యారని, ఆయనపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసినట్టు చెప్పారు. అలాగే, ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కలెక్టర్‌ విచారణ కొనసాగుతోందని ద్వివేది స్పష్టంచేశారు.