రుణమాఫీపై స్పష్టత ఇవ్వండి
– 9 డెడ్‌లైన్
– రమణ అల్టిమేటం
మెదక్, అక్టోబర్6(జనంసాక్షి):
రైతు రుణమాఫీపై ఈ నెల 9వతేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధిస్తున్నామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మెదక్ జిల్లా గజ్వెల్‌లో మాట్లాడుతూ ఈనెల 9వతేదీ లోపు ఒకటేసారి రుణమాపీ చేస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేయాలని, లేకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో నుంచి అడుగు కూడా బయటపెట్టలేరని ఆయన హెచ్చరించారు. రుణమాఫీ మొత్తం ఒకటేసారి చేయడం వల్ల ప్రభుత్వానికి వస్తున్న ఇబ్బందులేమిటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేస్తామని హావిూ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఆ హావిూని విస్మరించారన్నారు. రోజురోజుకూ రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. గజ్వెల్‌లో టిడిపి నేత ఒంటేరు ప్రతాపరెడ్డి నిర్వహించిన ఒకరోజు దీక్షలో పలువురు టిడిపి నేతలు పాల్గొన్నారు.
రైతులకు అండగా టీడీపీ, బీజేపీలు ఉంటాయని రమణ అన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్‌లో టీడీపీ, బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం మహాధర్నా జరిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న రమణ మాట్లాడుతూ… తెలంగాణలో వ్యవసాయం సంక్షోభంలో పడిందన్నారు. అలాగే తెలంగాణలో వ్యవసాయ ఎమర్జెన్సీని విధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, యువరైతులు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. అలవికాని కోరికలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో పేర్కొనడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. టీఆర్‌ఎస్ భూదందాలు, కబ్జాల ప్రభుత్వమన్నారు. రైతుల కోసం విపక్షాలు పోరాడుతుంటే వారిని శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం దారుణమన్నారు. కాంట్రాక్టర్లకు కేసీఆర్ ప్రభుత్వం వంతపాడుతోందని ఆయన పేర్కొన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు ఐక్యంగా, ఏకతాటిపై పోరాటాలు చేస్తామని టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలన్నారు. విడతల వారీగా చేయడం వల్ల రైతుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈవిషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే రైతులకు చాలా చేశామని సీఎం చెబుతున్నారని, అసలు ఏం చేశారో చెప్పాలన్నారు. రైతుల కోసం ఓ మెట్టు దిగి కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాడుతున్నామని, కేసీఆర్ కు చేతకాకపోతే చెప్పాలని, కేంద్రం కాళ్లు పట్టుకోనైనా రైతు రుణ మాఫీ చేయిస్తామన్నారు. టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య పొత్తు కోసమే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నట్లుగా ఉందని భారతీయ జనతాపార్టీ శాసనసభాపక్ష నేత కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించేందుకే ఆరునెలలకోసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయే తప్ప సమస్యలకు పరిష్కారం మాత్రం లభించడం లేదరన్నారు. అలాగే రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ఆదుకునేందుకు కేంద్రం సిద్దంగా ఉందని, అయినా… ఆదిశగా ప్రభుత్వం కృషిచేయడం లేదన్నారు.