రూపాయి పతనంతో.. 

అన్ని వర్గాలకు నష్టమే
– పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
కోల్‌కతా, ఆగస్టు16(జ‌నం సాక్షి): డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.32కు చేరిన విషయం తెలిసిందే. రూపాయి విలువ రోజురోజుకీ పడిపోతుండడంపై పశ్చిమ్‌ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.  గురువారం ఆమె విూడియాతో మాట్లాడారు.. ఈ పరిస్థితులు దేశంలో ఇంధన దిగుమతుల రేట్లు పెరిగేలా చేస్తాయని, చిన్న పరిశ్రమల వ్యాపారాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో రైతులు కూడా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ‘రూపాయి మారకం విలువ జీవనకాల కనిష్ఠానికి పడిపోయిందన్నారు. దీనిపై మేము చాలా ఆందోళన చెందుతున్నామని తెలిపారు. ఇంధన దిగుమతుల ధరలు పెరుగుతాయని, రైతులపై కూడా ప్రభావం పడుతుందని, కూరగాయల ధరలు పెరిగిపోతాయని మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక రంగంపై ప్రతికూల పరిస్థితులు పడ్డాయని, ఇప్పుడు రూపాయి మారకం విలువ తగ్గుతోందన్నారు. ఈ పరిస్థితులు చిన్న తరహా
వ్యాపారాలను దెబ్బతీస్తాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మంగళవారం అమెరికన్‌ డాలరుతో పోల్చితే రూపాయి విలువ రూ.69.89 వద్ద ముగిసింది. బుధవారం ఫారెక్స్‌ మార్కెట్‌కు సెలవు దినం. గురువారం ఉదయం 10.45 సమయంలో రూ.70.23గా ఉన్న రూపాయి మారకం విలువ అనంతరం మరింత దిగజారి రూ.70.32కి పడిపోయింది. రూపాయి విలువ పడిపోతుండడంపై ఎన్డీఏ సర్కారుపై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.