రూపాయి పతనంతో మార్కెట్లు ఢీలా

– నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు
– లాభాల్లో ఐటీ, ఔషధ రంగ షేర్లు
ముంబయి, ఆగస్టు16(జ‌నం సాక్షి ) : రెండు రోజులుగా నష్టాల బాటలోసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు గురువారం కూడా అదేబాటలో సాగాయి. దేశీయ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంకింగ్‌, లోహ రంగ షేర్లు నష్టపోవడంతో పాటు రూపాయి మరింతగా పతనమవ్వడంతో మార్కెట్లు డీలా పడ్డాయి. లోహ రంగ షేర్లు అధికంగా నష్టపోయినప్పటికీ, బ్యాంకింగ్‌ షేర్లు నష్టపోవడం మార్కెట్లపై అధిక ప్రభావం చూపించింది. ఐటీ, ఔషధ రంగ షేర్లు లాభపడ్డాయి. గురువారం ఉదయం నష్టాల్లోనే ప్రారంభమైన సూచీలు మధ్యలో స్వల్ప లాభ నష్టాలతో ఒడిదొడుకుల్లో సాగాయి. మధ్యాహ్నం నుంచి ఇక పూర్తిగా నష్టాల్లోకి వెళ్లిపోయాయి. సెన్సెక్స్‌ 150 పాయింట్ల నష్టంతో ప్రారంభం కాగా, నిఫ్టీ 11,400 పాయింట్ల దిగువన ప్రారంభమైంది. చివరకు సెన్సెక్స్‌ 188 పాయింట్లు నష్టపోయి 37663.05 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 50.5 పాయింట్ల నష్టంతో 11385.05 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.27 వద్ద కొనసాగుతోంది. ఈరోజు రూపాయి విలువ ఓ దశలో అత్యంత కనిష్ఠంగా రూ.70.32కు పడిపోయింది. టర్కీ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో రూపాయి క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. నేటి ట్రేడింగ్‌లో గెయిల్‌, డా.రెడ్డీస్‌ ల్యాబ్స్‌, సన్‌ ఫార్మా, లుపిన్‌, ఇన్ఫోసిస్‌ తదితర కంపెనీల షేర్లు లాభాలను నమోదు చేశాయి. కొటక్‌ మహీంద్రా బ్యాంకు, వేదాంత, ఐడియా సెల్యూలార్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తదితర కంపెనీలు బాగా నష్టపోయాయి.