రూ. 20 కోట్లతో 25 నిమజ్జన కొలనుల నిర్మాణం

చెరువుల పరిరక్షణలో బల్దియా మరో ప్రయోగం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ లో చెరువులు మరింతగా కాలుష్యం కాకుండా జీహెచ్‌ఎంసీ నగరంలో 25 వినాయక నిమజ్జన కొలనులను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌ నగరంలో ఉన్న 185 చెరువులు మరింత కాలుష్యానికి గురికాకుండా పరిరక్షించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ ఈ నిమజ్జన కొలనులను నిర్మిస్తోంది. చెరువుల పరిరక్షణలో భాగంగా ప్రతి చెరువుకు పూర్తి నిల్వ మట్టం గుర్తించడం, చెరువులు ఆక్రమణలకు గురికాకుండా చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు, ప్రహారీల ఏర్పాటు తదితర చర్యలను చేపట్టింది. ప్రధానంగా ఈ చెరువుల్లో ఎ/-లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ ఇతర ప్రమాదకర రసాయన పదార్థాలతో తయారు చేసిన వినాయక, ఇతర విగ్రహాల నిమజ్జనాన్ని చేయడం ద్వారా కాలుష్యానికి గురవుతున్నాయి. ఈ కాలుష్య నివారణకు చెరువుల్లో ప్రత్యేకంగా వినాయక నిమజ్జన కొలనుల నిర్మాణాన్ని జీహెచ్‌ఎంసీ చేపట్టింది. బెంగళూరు నగరంలో నిర్మించిన ఇలాంటి వినాయక నిమజ్జన కొలనులను అధ్యయనం చేసిన అనంతరం గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 25 ప్రాంతాల్లో నిమజ్జన కొలనులను జీహెచ్‌ఎంసీ నిర్మిస్తోంది. గత సంవత్సరం 10 నిమజ్జన కొలనులను నిర్మించగా ప్రస్తుత సంవత్సరం మరో 15 కొలనుల నిర్మాణాన్ని చేపట్టింది. సెప్టెంబర్‌ 5న నిర్వహించే వినాయక నిమజ్జనం వరకు 15 కొలనుల నిర్మాణాన్ని పూర్తిచేయడానికి జీహెచ్‌ఎంసీ లేక్స్‌ విభాగం ఇంజనీర్లు పర్యవేక్షిస్తున్నారు. గత సంవత్సరం రూ. 6.95 కోట్ల రూపాయల వ్యయంతో పది గణెళిష్‌ నిమజ్జన కొలనుల నిర్మాణాన్ని పూర్తిచేశారు.