రూ.30లక్షలతో ముక్కోటి ఉత్సవాలు
ఖమ్మం, డిసెంబర్ 12 : దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచి, భక్తులు కోరిన కోర్కెలను ఈడేర్చే కొంగుబంగారమై బాసిల్లుతున్న భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 14 నుంచి ముక్కోటి వైకుంఠ ఏకాదళి మహోత్సవాలు (అధ్యయనోత్సవాలు) ప్రారంభమవుతాయని దేవస్థానం అధికారులు తెలిపారు. 30 లక్షల రూపాయలతో చేపట్టిన ఏర్పాట్లు ఈ నెల 20 నాటికి పూర్తవుతాయని అన్నారు. మొదటి రోజు నుంచి స్వామివారికి దశావతారాలు ఉంటాయని అన్నారు. 23న తెప్పోత్సవం ఉంటుందని, అదే రోజు సాయంత్రం నాలుగు స్వామివారు పవిత్ర గోదావరి నదితీరానికి వేంచేస్తారు. ఆ తర్వాత గోదావరి అలలపై ఏర్పాటు చేసిన హంసాలంకృత తెప్పపై శ్రీసీతారాముల తెప్పోత్సవం వైభవంగా జరుగుతుంది. మరుసటి రోజు 24న ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు స్వామివారు ఉత్తర ద్వారా గుండా భక్తులకు దర్శనం కలిగించనున్నారు. దేశ నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు రానున్నందున రెండు లక్షల 50 వేల లడ్డు ప్రసాదం తయారు చేస్తున్నట్లు తెలిపారు. తాత్కాలికంగా శామియానాలు, 120 మరుగుదొడ్లు, నాలుగు క్లోక్‌రూంలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అన్ని శాఖల సహకారంతో భక్తులకు సులభంగా దర్శనం కలిగేలా చూస్తామని తెలిపారు.