రూ. 7 పెరిగిన సబ్సిడీ సిలెండర్‌ ధర

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): వంట గ్యాస్‌ వినియోగ దారుడిపై మరోసారి భారం పడనుంది. ప్రతి నెలా ధరల పెంపు నిర్ణయంలో భాగంగా ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలను అయిల్‌ కంపెనీలు భారీగా పెంచేశాయి. శుక్రవారం ప్రకటించిన తాజా నిర్ణయం ప్రకారం సబ్సిడీ సిలిండర్‌ రూ. 7, నాన్‌ సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.73.5 మేర పెరగనుంది. ఏవియేషన్‌ టర్భైన్‌ ఫ్యూయల్‌-ఏటీఎఫ్‌ ను 4 శాతం పెంచింది. ప్రతి నెల సిలిండర్‌పై 4 రూపాయల చొప్పున పెంచుతూ పూర్తిగా సబ్సిడీనీ ఎత్తివేయాలని ప్రభుత్వానికి చెందిన చమురు కంపెనీలను ప్రభుత్వం కోరింది. చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 31 న లోక్‌సభలో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అమ్మిన కిరోసిన్‌ ధరను కూడా లీటరుకు 25 పైసలు చొప్పున పెంచింది.