రెండు గ్రామాల్లో పోలింగ్ బహిష్కరణ
చర్చలు జరుపుతున్న అధికారులు
ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్ధులు
నెల్లూరు, జూన్ 12 : జిల్లాలో చెదురుమదురు సంఘటనలు మినహా లోక్‌సభ నియోజకవర్గానికి, ఉదయగిరి అసెంబ్లీ సెగ్మెంటుకు ఎన్నికలు మంగళవారం నాడు ప్రశాంతంగా జరుగుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో తెల్లవారుజామున ఐదు గంటల నుండే పోలింగ్ బూత్ వద్ద ఓటర్లు బారులుదీరారు. తొలి రెండు గంటల్లోనే 25శాతం ఓటింగ్ నమోదు కాగా మధ్యాహ్యానికి 52శాతానికి చేరుకుంది. ఉదయగిరి నియోజకవర్గంలో, నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు అందిన నివేదిక ప్రకారం రెండు స్థానాలకు 52శాతం నమోదైనట్టు కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. వరికుంటపాడు మండలం జి.కొండారెడ్డిపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన గొడవలో ఇరువర్గాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. అరగంటపాటు ఎన్నికల ప్రక్రియకు విఘాతం ఏర్పడింది. పారామిలటరీ దళాలు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దాయి. కావలి రూరల్ మండలంలోని చౌదరిపాలెం గ్రామంలో, కొడవలూరు మండలంలో రాచర్లపాడు గ్రామంలో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. సుదీర్ఘ కాలంగా గ్రామంలో పొర్లుకట్ట నిర్మాణాన్ని చేపట్టకపోవడాన్ని, నీటి ఎద్దడిని నివారించక పోవడాన్ని నిరసిస్తూ చౌదరిపాలెం గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. ఇఫ్కో ఫ్యాక్టరీ నిర్మాణం కోసం తమ నుంచి బలవంతంగా తీసుకున్న భూములను తిరిగి స్వాధీనం చేస్తామని ప్రకటించేవరకు పోలింగ్‌లో పాల్గొనబోమని రాచర్లపాడు గ్రామస్తులు స్పష్టం చేశారు. రాచర్లపాడులో 500మంది ఓటర్లు, చౌదరిపాలెంలో 400 ఓట్లు ఉన్నాయి. మధ్యాహ్నాం 2 గంటల వరకు ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు. అధికార యంత్రాంగం పోలీసులను, రెవెన్యూ సిబ్బందిని రంగంలోకి దింపి గ్రామస్తులతో చర్చలు కొనసాగిస్తున్నారు. సమస్య ఇంకా కొలిక్కి రాలేదని కలెక్టర్ శ్రీధర్ అన్నారు.
రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తన కుటుంబ సభ్యులతో సహా నెల్లూరులోని రంగనాయకులపేటలోని ఎన్నికల బూతులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నెల్లూరు లోక్‌సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్ధి రాజ్‌మోహన్‌రెడ్డి తన సోదరుడు ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్ధి చంద్రశేఖరరెడ్డి తమ స్వగ్రామమైన బ్రాహ్మణపల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా నెల్లూరు టీడీపీ లోక్‌సభ అభ్యర్ధి వేణుగోపాలరెడ్డి జలదంకి మండలం బ్రాహ్మణకాకలోను, ఉదయగిరి టీడీపీ అభ్యర్ధి రామారావు దుగ్గలూరులోను, ఉదయగిరి కాంగ్రెస్ అభ్యర్ధి కె.విజయరామిరెడ్డి దుత్తలూరులోని తమ తమ ఓటు హక్కు వినియోగిం చుకున్నారు. నెల్లూరు లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్ధి టి.సుబ్బిరామిరెడ్డి తన ఓటు హక్కును నెల్లూరులో వినియోగించు కున్నారు. వీరితో పాటు జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పి రమణకుమార్ సెయింట్ జోసఫ్ స్కూలులోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు అందిన సమాచారం మేరకు లోక్‌సభకు, ఉదయగిరి అసెంబ్లీకి 50శాతం పోలింగ్ నమోదు కాగా.. సాయంత్రానికి ఉదయగిరిలో 80శాతం, నెల్లూరులోక్సభకు 75శాతం వరకు ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.