రెండు నెలలు దాటినా రుణమాఫీ ఏదీ?
మద్దతు ధరలపై కెసిఆర్ మౌనం వీడాలి: డిసిసి
కరీంనగర్,ఫిబ్రవరి22(జనంసాక్షి): రైతాంగానికి లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి 70 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదని డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం విమర్శించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసినట్లు తెలిపారు.మార్చి 31లోపు రుణమాఫీ చేసి రైతులకు కొత్త రుణాలను ఇవ్వాలని పేర్కొన్నారు. మద్దతు ధరల కోసం రైతులు ఆందోళన చేస్తున్నా కనీసంగా సిఎం కెసిఆర్ ప్రకటన చేయలేదన్నారు. ఎర్రజొన్నలకు,పసుపుకు 15 వేలు మద్దతు ధరలపై ప్రకటన చేయాలన్నారు. ప్రస్తుతం క్వింటాలు వరికి రూ.500, పుప్పు దినుసులకు
రూ.1000, పసుపు, మిర్చి, వాణిజ్ఞ పంటలకు రూ.1500ల బోనస్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాలన దిగుబడులకు దక్కని మద్ధతు ధర, రైతు రుణమాఫి, సాగునీటి విడుదల విషయాల్లో స్పష్టత లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పట్ల వివక్ష చూపి ఇక్కడికి సంబంధం లేని ప్రాంతానికి నీటిని తరలించారన్నారు. రెండు పంటలకు సరిపడా నీరు అందుబాటులో ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆయకట్టు పరిధిలో బావులపై ఆధారపడి వ్యవసాయం చేసే పరిస్థితిని కల్పించారని విమర్శించారు. నీటి విడుదలపై స్పష్టత లేకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. కాలువ నీటితో చెరువులు, కుంటలను నింపితే భూగర్భజలాలు పెరిగి రైతులు పంటలను బతికించుకుంటారని తెలిపారు. రైతులు పండించిన ధాన్యం, పసుపు, మిర్చి, కందులు, ఇతర పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు దిగుబడులను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ఎన్నికల్లో హావిూ ఇచ్చి, ఇప్పుడు కేవలం 10వేల క్వింటాళ్ల కందులను మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించడం సరికాదన్నారు.