రెండు రోజుల ఏసీబీ కస్టడీకి సండ్ర

2

హైదరాబాద్‌, జులై 8 (జనంసాక్షి):

టిటిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు రెండురోజుల ఎసిబి  కస్టడీకి కోర్టు అనుమతించింది. కస్టడీపై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరిచింది. ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలన్న ఏసీబీ వాదనను తోసిపుచ్చింది. రెండు రోజుల పాటు షరతులతో కూడిన కస్టడీ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.30గంటల పాటు అడ్వకేట్‌ ఎదుట విచారించవచ్చని, విచారణలో థర్డ్‌ డిగ్రీ చేయవద్దని ఆదేశించింది. విచారణ అనంతరం ఏసీబీ కార్యాలయంలోనే సండ్రను ఉంచాలని, మంచి భోజనం పెట్టాలని సూచనలు చేసింది.తిరిగి గురువారం సాయంత్రం అప్పగించాలని పేర్కొంది. ఓటుకు నోటు కేసులో సండ్రకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సండ్ర మే 30, 31వ తేదీల్లో రేవంత్‌ రెడ్డితో ఫోన్‌ లో మాట్లాడినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే అతన్ని విచారించేందుకు ఏసీబీ అధికారులు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చేందుకు హైదర్‌ గూడలోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే ఆ సమయంలో సండ్ర ఇంట్లో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించి వెనుదిరిగారు. ఆ తరువాత స్పందించిన సండ్ర తాను అనారోగ్యంతో బాధ పడుతున్నానని విచారణకు పది రోజుల తరువాత హజరవుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కొన్నారు. అయితే సోమవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో సండ్ర ఏసీబీ ఎదుట హాజరయ్యారు. సుమారు ఏడు గంటల పాటు విచారించారు. ఇప్పటికే ఈ కేసులో రేవంత్‌ రెడ్డి..సెబాస్టియన్‌, ఉదయ్‌ సింహాలు అరెస్టయి బెయిల్‌ పై విడుదల సంగతి తెలిసిందే. మరి విచారణలో సండ్ర ఎలాంటి విషయాలు చెబుతారనే

ఉత్కంఠ నెలకొంది.