రెండోరోజు సల్వీందర్‌ను విచారించిన ఎన్‌ఐఏ

3

న్యూఢిల్లీ,జనవరి12(జనంసాక్షి):  పంజాబ్‌ ఎస్పీ సల్వీందర్‌ సింగ్‌ రెండోరోజు ఎన్‌ఐఏ  ఎదుట హాజరయ్యారు. ఆయనకు  లై డిటెక్టర్‌ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకు కేంద్రం నుంచి కూడా అనుమతి లభించినట్లు సమాచారం. కాగా పఠాన్‌కోట్‌పై దాడికి ముందు ఉగ్రవాదులు తనను కిడ్నాప్‌ చేశారని పేర్కొన్న సల్వీందర్‌ సింగ్‌  కిడ్నాప్‌కు ముందు, తర్వాత జరిగిన సంఘటనలపై ఆయన చెప్తున్న కథనాల్లో పొంతన లేని అంశాలు ఉండటంతో  లోతుగా ప్రశ్నించేందుకు తన ఎదుట హాజరు కావాల్సిందిగా ఎన్‌ఐఏ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై దాడి చేయడానికి ముందు ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసినట్లు భావిస్తున్న గురుదాస్‌పూర్‌ ఎస్సీ సల్వీందర్‌సింగ్‌పై సందేహాలను ఎన్‌ఐఏ ఇంకా నివృత్తి చేయలేదు. తన కిడ్నాప్‌కు సంబంధించి సల్విందర్‌ వాస్తవాలను దాచి పెడుతున్నాడని దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. సోమవారం ఢిల్లీలోని ఎన్‌ఐఏ ప్రధానకార్యాలయంలో సల్విందర్‌ను దర్యాప్తు అధికారులు మరోమారు ప్రశ్నించారు. అతని స్థితి ఏమిటో ఇంకా నిర్ణయించలేదు. ఈరోజు ప్రశ్నించడం పూర్తయింది. ఆయన ఇచ్చిన సమాధానాలను విశ్లేషించిన తరువాత ఈ కేసులో అతడు నిందితుడా లేక సాక్షా అన్నదానిని నిర్ణయిస్తాం అని కేంద్ర ¬ం మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు. ఉగ్రవాదులు తనతోపాటు తన స్నేహితుడు రాజేశ్‌ వర్మ, వంటమనిషి మదన్‌గోపాల్‌ను కిడ్నాప్‌ చేశారని సల్విందర్‌ అప్పుడే తన పై అధికారులకు చెప్పారు. ప్రస్తుతం సల్వీందర్‌ సింగ్‌ పంజాబ్‌ సాయుధ పోలీసు 75వ బెటాలియన్‌కు అసిస్టెంట్‌ కమాండెంట్‌గా ఉన్నారు.  నిన్న ఆయనను ఎన్‌ఐఏ బృందం సుమారు 8 గంటలపాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎన్‌ఐఏ మాత్రం సల్వీందర్కు క్లీన్‌ చిట్‌ ఇవ్వలేదు. దీంతో మరోసారి ఆయనను విచారణకు హాజరు కావాలని ఎన్‌ఐఏ ఆదేశించడంతో మరోసారి విచారణకు హాజరయ్యారు.