రెండోరోజూ తెరుచుకోని శ్రీనగర్‌ ఎన్‌ఐటి

శ్రీనగర్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): జమ్ముకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లో క్రికెట్‌ వివాదం కారణంగా రెండోరోజు శనివారం కూడా మూతపడింది. శుక్రవారం విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగగా కాలేజీని మూతవేశారు.  టీ20 సెవిూ ఫైనల్స్‌లో భారత్‌ ఓడిపోవడంపై వివాదంచెలరేగింది. కళాశాలలోని కశ్మీరీ విద్యార్థులకు, కశ్మీరీయేతర విద్యార్థులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో కళాశాలను శుక్రవారం మూసేశారు. దీంతో ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో శనివారం కూడా కళాశాల తెరుచుకోలేదు. సోమవారం నుంచి తరగతులు ప్రారంభించాలా? వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు అధికారులు సమావేశం కానున్నారు. కళాశాల అధికారులు ముందు జాగ్రత్త చర్యగా స్థానిక విద్యార్థులు హాస్టల్‌ ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. దీంతో చాలా మంది స్థానిక విద్యార్థులు వారి స్వస్థలాలకు వెళ్లారు. గురువారం రాత్రి టీ20 సెవిూ ఫైనల్‌లో భారత్‌పై వెస్టిండీస్‌ గెలవడంతో కొందరు కశ్మీరీ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. దీంతో కశ్మీరీలు కాని విద్యార్థులకు, కశ్మీరీ విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకున్నట్లు క్యాంపస్‌ వర్గాలు తెలిపాయి. పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.