రెవెన్యూలో సాంకేతికతకు పెద్దపీట
వీఆర్వోలకు ట్యాబ్‌లతో సత్ఫలితాలు
నిజామాబాద్,మే12(జనం సాక్షి): రెవెన్యూ శాఖలో సత్వరం పనులను పూర్తి చేయడంతో పాటు వేగంగా స్పందించేలా మార్పులు తెస్తున్నారు. అందులో భాగంగా రెవెన్యూ పనులను ఎప్పటికప్పుడు
నిర్వహించేలా సాంకేతికను జోడించే చర్యలు ప్రారంభమయ్యాయి. దాని కోసం జిల్లాలో ఉన్న రెవెన్యూ కార్యదర్శులకు ట్యాబ్‌లను అందజేయడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. రానున్న రోజుల్లో ప్రజలకు దీని వల్ల ఎంతో మేలు కలుగుతుందని రెవెన్యూ ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో రెవెన్యూ కార్యదర్శులకు వీటిని అందజేశారు. గతేడాదిగా చేపట్టిన ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. సాంకేతికను అందిపుచ్చుకొని పనులను త్వరితగతిన నిర్వహించేలా శిక్షణ ఇచ్చారు. ప్రధానంగా వ్యవసాయపనుల్లో కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. రెవెన్యూ శాఖలో పనులు కావాలంటే నెలలు, సంవత్సరాలు పడుతుండడం అందరికి తెలిసిందే. ఈ క్రమంలో సాంకేతికతను ఉపయోగించు కుంటే సమస్యలను సత్వరం పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో వీఆర్వోలు చేసిన పనుల సమాచారం వెంటనే కింది స్థాయి నుంచి సీసీఎల్‌ఎ వరకు వెళ్తుంది. ట్యాబుల్లో వీఆర్వోలు, వీఐఆర్ అనే యాప్‌లు ఉంటాయి. వీటి ద్వారా పనులు వేగవంతం చేయడంతో కంప్యూటర్లలో సమాచారం నిక్షిప్తం అవుతుంది. భూములకు సంబంధించిన సమస్యలు ఉంటే క్షేత్రస్థాయికి వెళ్లి జియో ట్యాగింగ్ చేస్తారు. వీఆర్వోలు క్షేత్రస్థాయిలో ఎక్కడికి వెళ్లినా అక్కడి నుంచే పంచనామాలు, నివేదికలు ట్యాబ్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. వెంటనే తహసీల్దార్‌లకు సమాచారం వెళ్తుంది. అక్కడి నుంచి వెంటనే సీసీఎల్‌ఎకు చేరవేస్తారు. ఇందులో జీపీఎస్, జియోట్యాగింగ్ ఉంటుంది. ఉన్న చోటు నుంచే చిత్రం నమోదవుతుంది. దీంతో ఎక్కడ ఉన్నా వెంటనే ఆన్‌లైన్‌లో ఆ పని పూర్తి చేయొచ్చు. కామారెడ్డి జిల్లాలో 201 ట్యాబ్‌లు రావడంతో వాటిని ఆయా క్లస్టర్‌ల వారీగా రెవెన్యూ కార్యదర్శులకు అందజేశారు. వీటి వాడకంపై శిక్షణ కూడా అందించారు. వీఆర్వోలకు జిల్లా కేంద్రంలో శిక్షణ ఇచ్చిన తర్వాత జిల్లాలోనే అందరికి ట్యాబ్‌లను అందజేశారు. వీఆర్వోలు పనిచేసే గ్రామాల్లో గొడవలు, పిడుగుపడినా ఎలాంటి సమస్య నెలకొన్నా చిత్రాలు తీస్తే వెంటనే జియో ట్యాగింగ్ అవుతుంది. నిత్యం జరిగే సంఘటనలను వీటి ద్వారానే నివేదికల రూపంలో పంపించాల్సి ఉంటుంది. ఈ సమాచారం పై స్థాయి అధికారులకు చేరుతుంది. భూముల తాజా పరిస్థితిని తెలుసుకోవడానికి అవి ఉపయోగపడతాయి.