రెవెన్యూ డివిజన్ గా ప్రకటించకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు

రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నాయకుల ఆగ్రహం

చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 07 : రాష్ట్ర ప్రభుత్వం కొమురవెల్లి, మద్దూరు,దూల్మిట్ట మండలాలను కలుపుకుని చేర్యాల మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని జేఏసీ ఆధ్వర్యంలో చేర్యాల పాత బస్టాండ్ వద్ద కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 27వ రోజుకు చేరాయి. ఇందులో భాగంగా శనివారం టిటిడిపి నాయకులు దీక్షలో కూర్చుని మనవహరం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. అలాగే 11వ తేదీన నాలుగు మండలాల బంద్ కు జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. అందుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫోన్ ద్వారా దీక్షలో కూర్చున్న నాయకులకు మద్దతు ప్రకటించి మాట్లాడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆప్కో మాజీ చైర్మన్, బిఆర్ఎస్ రాష్ట్ర నేత మండల శ్రీరాములు అనంతరం టిడిపి నాయకులు మాట్లాడారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని గత ఐదు సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలతో పాటు దీక్షలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్య అని రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని లేదంటే ప్రజా ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. 11న జరగబోయే బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ దీక్షకు జిల్లా రెడ్డి జేఏసీ సంఘం అధ్యక్షులు ఐలేని మల్లికార్జున్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, రాజీరెడ్డి, గాలిరెడ్డి లు దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ దీక్షలో టిడిపి మండల అధ్యక్షుడు కుర్రారం బాల్ నర్సయ్య, కొమురవెల్లి మండల అధ్యక్షుడు పబ్బోజు రాములు చారి, మద్దూరు మండల అధ్యక్షుడు నారదాసు సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు మిట్టపల్లి నారాయణరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరాముల రాజు తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.