రేపటి కార్మిక గర్జనను జయప్రదం చేయండి

భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె అశోక్

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం

చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 07 : భవన నిర్మాణ కార్మిక సమస్యలపై నేడు 8న జనగామ ప్రిస్టన్ గ్రౌండ్ లో జరిగే కార్మిక గర్జన సభను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె అశోక్ పిలుపునిచ్చారు. శనివారం వీరన్నపేట, ముస్త్యాల గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుని సహజ మరణానికి ఒక లక్ష 30 వేల నుండి 5 లక్షలకు పెంచాలని, గీతా, నేత కార్మికులకు ఇచ్చే విధంగా 50 సంవత్సరాలు నిండిన ప్రతి భవన నిర్మాణ కార్మికునికి 6వేలు పెన్షన్ ఇవ్వాలని, లేబర్ కార్డు రెన్యువల్ 5సంవత్సరాల నుండి పది సంవత్సరాలకు పెంచాలని, పెండ్లి, డెలివరీ కేసులకు ఇస్తున్న 30 వేల ఆర్థిక సాయాన్ని కళ్యాణ లక్ష్మి మాదిరిగా ఒక లక్ష రూపాయలకు పెంచాలన్నారు. లేబర్ కార్డును 60 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వరకు వయస్సు పొడిగించాలని, భవన నిర్మాణ కార్మికులకు ప్రోత్సాహంగా కార్మిక బంధు వర్తింపజేసి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కల్పించాలని, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి భవన నిర్మాణ కార్మికుల అందిస్తున్న సంక్షేమ పథకాలు హమాలీ కార్మికులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల సాధనకై జనగామ ప్రిస్టన్ గ్రౌండ్ లో మధ్యాహ్నం 1గంటలకు జరిగే కార్మిక గర్జనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఈరి భూమయ్య, దండబోయిన వెంకటేష్, పొన్నబోయిన మహేందర్, సిద్దిరాం భద్రయ్య, చేరాల ఎల్లవ్వ, మ్యాక లలిత, బింగి లచ్చవ్వ, రాసురి వెంకటవ్వ, శిగుళ్ల పద్మ తదితరులు పాల్గొన్నారు.