రేపటి నుంచి కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు
రేపటి నుంచి కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలుఇటిక్యాల (జనంసాక్షి) మార్చి 25 : మండల పరిధిలోని బీచుపల్లి పుణ్య క్షేత్రంలోని దక్షిణ వాహిని అయిన కృష్ణానది వడ్డున వెలసిన శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఈ నెల 27వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం కోయిల్ అల్వార్ తిరుమంజనం, సాయంత్రం అంకురార్పణ, మంగళవారం ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం శ్రీ లక్ష్మీ హయగ్రీవ హోమం, బుధవారం ఉదయం ధన్వంతరి హోమం, సాయంత్రం సుదర్శన హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే గురువారం శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఉదయం 10 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిపించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే సాయంత్రం రథోత్సవం, శుక్రవారం ఉదయం చక్రస్నానం, మహాపూర్ణహుతి, సాయంత్రం ఐశ్వర్య ప్రాప్తి, శ్రీమహాలక్ష్మి హోమం, శనివారం ఉదయం శ్రీరామచంద్రల వారి సామ్రాజ్య పట్టాభిషేకం, సాయంత్రం ద్వాదశాదరణ, శ్రీ పుష్పయాగం, ధ్వజావరోహణం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మండల కేంద్రంతో పాటు తిమ్మాపురం, యాక్తాపురం, కొండపేట, ఎర్రవల్లి, షేక్ వల్లి, కొండేరు, కోదండపురం, జింకలపల్లి, ససానూలు, బి వీరాపురం, ఆర్ గార్లపాడు, ధర్మవరం గ్రామాల తోపాటు గద్వాల, వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, కర్నూలు, తదితరల ప్రాంతాల నుండి భక్తులు హాజరై తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ మేనేజర్ సురేందర్ రాజు కోరారు.