రేపటి నుంచి వర్క్ టూ రూల్ పాటిస్తాం: ఉపేందర్

హైదరాబాద్‌: శనివారం నుంచి వర్క్ టూ రూల్ పాటిస్తామని వీఆర్వోల సంఘం అధ్యక్షుడు ఉపేందర్ తెలిపారు. గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం సమావేశమైంది. అనంతరం ఉపేందర్ మీడియాతో మాట్లాడుతూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పనిచేస్తామని, తమ పరిధిలో ఉన్న గ్రామాల్లో మాత్రమే పని చేస్తామని చెప్పారు. అదనపు విధులు ఎట్టి పరిస్థితుల్లో చేయబోమని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులు అవినీతికి పాల్పడితే అందుకు ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. లోపభూయిష్టమైన చట్టాల వల్లే ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ప్రజల్లో తమను శత్రువులుగా చిత్రీకరించే విధానం మంచిది కాదని ఉపేందర్ సూచించారు.