రేపటి నుంచి సినిమా షూటింగ్స్ బంద్

హైదరాబాద్ : రేపటి నుంచి సినిమా షూటింగ్స్ ను నిలిపివేస్తున్నామని టాలీవుడ్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్ తెలిపారు.  ఫిల్మ్ చాంబర్ లో ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ్ దాస్ నారంగ్ మాట్లాడుతూ..24 విభాగాలతో సుదీర్ఘ సమావేశం తర్వాత సినిమా షూటింగ్స్ నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. షూటింగ్స్ లో చాలా మంది ఉంటారు. వాళ్ల ఆరోగ్యం దృష్ట్యా రేపటి నుంచి 31 వరకు సినిమాలు, టీవీ సీరియళ్లు, వెబ్ సిరీస్ తోపాటు ఇతర షూటింగ్స్ నిలిపివేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్చించి ఏకగ్రీవంగా ఈ ప్రకటన చేస్తున్నామని తెలిపారు. మార్చి 30న పరిస్థితులకనుగుణంగా మరోసారి సమావేశమై..తిరిగి షూటింగ్స్ ఎప్పుడు ప్రారంభించాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రప్రభుత్వం మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. పార్కులు, మాల్స్, పబ్ లు, స్టేడియంలు మూసివేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రత్యేకంగా సమావేశమైంది.