రేపు ఎన్నికలు..

భాజపా అభ్యర్ధి కాంగ్రెస్‌లోకి జంప్‌!

– కర్ణాటక ఉపఎన్నికల్లో భాజపాకు ఎదురుదెబ్బ

– రాంనగర్‌ అసెంబ్లీకి 3న ఉపఎన్నికలు

– భాజపా తరపున బరిలోకి దిగిన ఎల్‌. చంద్రశేఖర్‌

– కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించి భాజపాకు షాక్‌ ఇచ్చిన చంద్రశేఖర్‌

– భాజపాలో ఐకమత్యం లేదని వెల్లడి

– దాదాపుగా ఖరారైన సీఎం కుమారస్వామి సతీమణి అనిత ఎన్నిక

బెంగళూరు,నవంబర్‌1(జ‌నంసాక్షి) : కర్ణాటకలో భాజపాకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఈ నెల3న కర్ణాటకలోని రామనగర అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనుంది. కాగా.. రేపు ఎన్నికల అనగా భాజపా తరుపున నామినేషన్‌ వేసిన ఎల్‌. చంద్రశేఖర్‌ అనూహ్యంగా చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకొని భాజపాకు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా తాను కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆ నియోజకవర్గంలో నుంచి కాంగ్రెస్‌ మద్దతుతో జేడీఎస్‌ పార్టీ తరుపున బరిలో నిలిచిన కుమారస్వామి సతీమణి అనిత విజయం అనివార్యం కానుంది.. వివరాల్లోకి వెళితే.. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఉప ఎన్నికల్లో మరో ఎదురుదెబ్బ తగిలింది. రామనగర అసెంబ్లీ ఉప ఎన్నికకు భాజపా తరఫున బరిలోకి దిగిన అభ్యర్థి ఎల్‌.చంద్రశేఖర్‌ అనూహ్యంగా చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకొన్నారు. అంతేగాక పార్టీ కూడా మారారు. తాను తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తున్నట్లు గురువారం ప్రకటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అసెంబ్లీ ఎన్నికల్లో రామనగర, చెన్నపట్న నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. అయితే ఫలితాల తర్వాత ఆయన రామనగర స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో జేడీఎస్‌ పార్టీ నుంచి సీఎం కుమారుస్వామి సతీమణి అనిత కుమారస్వామి బరిలోకి దిగారు. ఇక సంకీర్ణ ప్రభుత్వంలో జేడీఎస్‌కు మద్దతుగా ఉన్న కాంగ్రెస్‌ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. అనితకు వ్యతిరేకంగా భాజపా చంద్రశేఖర్‌ను బరిలో నిలిపింది. అయితే కాంగ్రెస్‌ నేత అయిన చంద్రశేఖర్‌ ఇటీవలే భాజపాలో చేరారు. దీంతో రామనగర ఉపఎన్నికలో అనిత, చంద్రశేఖర్‌ మధ్య ¬రా¬రీ పోటీ తప్పదని అంతా భావించారు. దీంతో రామనగర ఉపఎన్నిక అటు భాజపా, ఇటు జేడీఎస్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో ఎన్నిక జరగాల్సి ఉండగా.. చంద్రశేఖర్‌ చివరి నిమిషంలో తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. దీంతో భాజపాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అంతేగాక.. తాను మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు చంద్రశేఖర్‌ ప్రకటించారు. భాజపాలో ఐకమత్యం లేదని, పార్టీలో తనకు ఎవరూ మద్దతుగా లేరని చంద్రశేఖర్‌ ఆరోపిస్తున్నారు. అందుకే తాను తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు చెప్పారు. కాగా.. చంద్రశేఖర్‌ తప్పుకోవడంతో అనిత కుమారస్వామి గెలుపు దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది.