రేపే బీహార్ మూడో దశ పోలింగ్

పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న విషయం విదితమే. ఇప్పటికే తొలి, రెండో దశ ఎన్నికలు పూర్తి అయ్యాయి. దసరా పండుగ నేపథ్యంలో మూడో దశ పోలింగ్ కాస్త ఆలస్యమైంది. ఇక మూడో దశ పోలింగ్ ఈ నెల 28న జరగనుంది. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 50 నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల్లో 808 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో మహిళా అభ్యర్థులు 71 మంది ఉన్నారు.

ఇక ఈ దశలోనే లాలు కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. మూడో దశ పోలింగ్ కోసం 14,170 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 6,747 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.